
- అగ్రికల్చర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై
- వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో పుదుచ్చేరి నుండి పాల్గొన్న గవర్నర్
హైదరాబాద్: రైతుల ఆదాయం రెట్టింపు చేయడం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై విరివిగా పరిశోధనలు జరగాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చాలన్నా, రైతుల ఆదాయాలను రెండింతలు చేయాలన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. సంప్రదాయ వ్యవసాయిక విజ్ఞానాన్ని, ఆధునిక టెక్నాలజీతో కూడిన వ్యవసాయిక పద్ధతుల కలయికతో వ్యవసాయాన్ని సుస్థిర చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఆన్ లైన్ లో పాల్గొన్న గవర్నర్ చాన్సలర్ హోదా లో ప్రసంగించారు. ప్రధాని మోడీ కలలు కంటున్న ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో వ్యవసాయ రంగం పాత్ర కీలకమన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ, కేసులు, ట్రీట్మెంట్ సంక్షోభం సేంద్రీయ, సంప్రదాయ వ్యవసాయ (ఆర్గానిక్ ఫార్మింగ్) పద్ధతుల అవసరాన్ని మరొక్కసారి చాటిచెప్పింది అన్నారు.రాజ్ భవన్ ద్వారా చేపట్టిన ఒక సర్వేలో ఆదిమజాతి గిరిజనులకు వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ, వ్యవసాయం చేసే విధానం తెలియక వారు సాగు చేయలేకపోతున్నారని తెలిసిందన్నారు. చెంచులకు వ్యవసాయం, పాడి పశువుల పోషణ తదితర అంశాలలో ప్రోత్సాహం ఇచ్చినట్లయితే వారి ఆదాయాలు పెరగడంతో పాటు, వారి లో పోషకాహారం స్థాయి కూడా పెరుగుతుందని డాక్టర్ తమిళిసై వివరించారు.వ్యవసాయ పట్టభద్రులు ఈ దిశగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ప్రపంచం వేగంగా మారుతోంది అని, కొత్త ఆలోచనలు, కొత్త ఆలోచనా విధానం, వినూత్న ఆవిష్కరణలు మరింత అవసరమని గవర్నర్ తెలిపారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో భారత్ ను, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ విశ్వవిద్యాలయం పై, వ్యవసాయ పట్టభద్రుల పై ఉన్నదని డాక్టర్ తమిళిసై ఉద్భోదించారు. తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమ కార్యక్రమాలతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా అవతరించిందని గవర్నర్ అభినందించారు. సాగును లాభసాటిగా చేయడం, సుస్థిర పద్ధతులు అనుసరించడం, భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించడం అత్యంత కీలక అంశాలని గవర్నర్ స్పష్టం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి హబ్ ను, ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఈ రంగంలో ఆధునిక పరిశోధన పద్ధతులను, ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ కు వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. వర్చువల్ ఈ పద్ధతిలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో గవర్నర్ పుదుచ్చేరి నుండి పాల్గొని విద్యార్థులకు, పరిశోధకులకు పట్టాలను ప్రధానం చేశారు. విజేతలకు మెడల్స్ అందజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.