రాజ్యసభ ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన జైశంకర్

రాజ్యసభ ఎన్నికలు..  నామినేషన్ దాఖలు చేసిన  జైశంకర్

కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ 2023 జూలై 10 సోమవారం గాంధీనగర్  నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ తో పాటుగా బెంగాల్, గోవా రాష్ట్రాల్లో జరగబోయే మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం..  గుజరాత్‌కు చెందిన ఎస్ జైశంకర్ ను మరోసారి ఎన్నికల బరిలో దించింది.  ఈ క్రమంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జైశంకర్  మీడియాతో మాట్లాడారు.  ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి, గుజరాత్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  . గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం.. గత 4 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన మార్పుల్లో భాగమయ్యే అవకాశం తనకు లభించడం అదృష్టమన్నారు.  జైశంకర్ 2019లో  గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు

మరోవైపు గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో తమకు పెద్దగా సీట్లు లేనందున ఈసారి ఎన్నికల్లో పాల్గొనబోమని కాంగ్రెస్‌ ప్రకటించింది. గత ఏడాది చివర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లు సాధించగా, కాంగ్రెస్ కేవలం 17 సీట్లు మాత్రమే సాధించింది.  

గుజరాత్ తో పాటుగా వెస్ట్ బెంగాల్ లో ,గోవా  రాష్ట్రాల్లో కలిపి మొత్తం 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 2023 జూలై 13 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఎవరైనా తమ  పేరును ఉపసంహరించుకోవాలనుకుంటే, జూలై 17 వరకు టైమ్ ఉంటుంది. 2023  జూలై 24న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు.