న్యూఢిల్లీ: భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రపంచంలోని ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరుచుకునే స్వేచ్ఛ, హక్కు దేశానికి ఉన్నదని చెప్పారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమిట్‌లో జైశంకర్ మాట్లాడారు.
రష్యా అధ్యక్షుడి భారత పర్యటన, మోదీతో భేటీ.. అమెరికాతో సంబంధాలను సంక్లిష్టం చేస్తుందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘పుతిన్ పర్యటనపై పాశ్చాత్య దేశాల పత్రికల్లో వచ్చిన కథనాల గురించి నేను ప్రస్తావించను.
వీలైనంత ఎక్కువ దేశాలతో సంబంధాలు ఏర్పరుచుకోవడం భారత్‌కు ఇప్పుడు కీలకం. ఏ దేశంతో రిలేషన్‌షిప్ ఏర్పరుచుకోవాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ మాకున్నది” అని పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానం స్వీయ నిర్దేశితమైనదని, దేశ ప్రయోజనాల కోసమే తాము నిలబడతామని తెలిపారు.
త్వరలో అమెరికాతో ట్రేడ్ డీల్..
గత 70–80 ఏండ్లుగా భారత్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నదని జైశంకర్ చెప్పారు. ప్రపంచమంతా అనిశ్చిత పరిస్థితులున్నా.. భారత్–రష్యా బంధం మాత్రం స్టెబుల్‌గానే ఉన్నదని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అవి కొలిక్కి వచ్చి ట్రేడ్డీల్ చేసుకుంటామని వెల్లడించారు.
రైతులు, కార్మికులు, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలకు తగ్గట్టుగానే ఇది ఉంటుందని చెప్పారు. దౌత్యం అంటే మరొకరిని సంతోష పెట్టడం కాదని, దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు.
అది షేక్ హసీనా నిర్ణయించుకోవాలి..
భారత్‌లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎంతకాలం ఉంటారనే ప్రశ్నపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉండటం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, ఆమె దేశానికి రావడానికి దారితీసిన పరిస్థితులు దానిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ఆమె క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు వచ్చారని అన్నారు. ఎంతకాలం ఇక్కడ ఉంటారనేది ఆమెనే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఏర్పాటుపై అక్కడి ప్రజలకు అభ్యంతరాలున్నాయని, అక్కడ విశ్వసనీయమైన ప్రజాస్వామ్య ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఆ సమస్య ఎన్నికలే అయితే.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం బంగ్లాదేశ్ చేయాల్సిన మొదటి పని అని చెప్పారు. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ క్షేమాన్ని కోరుకుంటుందని, ఒక ప్రజాస్వామ్య దేశంగా.. ఏ ప్రజాస్వామ్య దేశమైనా ప్రజల అభీష్టం ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా నెరవేరాలనే అనుకుంటుందని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ ఆర్మీ నుంచే మనకు సమస్యలు
పాకిస్తాన్ ఆర్మీ నుంచే భారత్‌కు సమస్యలు వచ్చిపడుతున్నాయని జైశంకర్ అన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురించి ప్రశ్న అడగ్గా.. ఆ దేశ సైన్యంపై విమర్శలు చేశారు. పాక్ ఆర్మీ నిజస్వరూపం మనకు తెలుసని.. అదే మనకు ప్రధాన సమస్య అని అన్నారు. దేశ నియమ, నిబంధనల ప్రకారమే ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టినట్టు తెలిపారు. సరిహద్దుల్లో శాంతి కోసం భారత్- –చైనా సంబంధాలు కీలకమని, ఇటీవల ఇరుదేశాల మధ్య రిలేషన్‌షిప్ బలపడిందని తెలిపారు.
