జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ మహిళల ఆందోళన

జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ మహిళల ఆందోళన

ప్రకాశం: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొగాకు రైతులకు మద్దతుగా బుధవారం (జూన్ 11) జగన్ పొదిలి వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఆందోళనకు దిగారు. జగన్ గోబ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాక్షి ఛానెల్‎లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన మహిళలు జగన్ కాన్వాయ్‍పై చెప్పులు విసిరారు.

నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి మౌనం వీడాలి.. ఏపీని వీడాలి, అమరావతి అమ్మలను అవమానించిన వైసీపీ షేమ్ షేమ్ జగన్.. సాక్షిని బ్యాన్ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. జగన్ సతీమణి భారతి రెడ్డి మౌనం వీడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు రాళ్ళు, చెప్పులు విసురుకున్నారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌కు గాయం అయింది. కొందరు మహిళలు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇఱు వర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను, పలువురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.