- రాష్ట్రంలో ప్రతి 5 రోజులకోసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు
- ఈ ఏడాది 273 రోజుల్లో 54 రోజులపాటు ఇదే సిచ్యువేషన్
- ప్రాణ నష్టంతోపాటు పంటలపై భారీగా ఎఫెక్ట్
- దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిణామాలే
- సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీలో వెల్లడి
- మన రాష్ట్రంలో గత నాలుగేండ్ల పరిస్థితి ఇదీ..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి లాంటి వైపరీత్యాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల మరణాలు కూడా అధికమవుతున్నాయి. 2022 నుంచి 2025 వరకు (జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో) తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇండియా క్లైమేట్ 2025: యాన్ అసెస్మెంట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’ పేరిట ఈ మేరకు ఆ సంస్థ ఒక రిపోర్టును విడుదల చేసింది.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 273 రోజుల్లో 54 రోజుల పాటు తీవ్రమైన వాతావరణ పరిస్థితులున్నట్టు ఆ రిపోర్ట్ తేల్చింది. అందులో 26 రోజుల పాటు భారీ వర్షాలు, వరదలు సంభవించగా, 24 రోజులపాటు పిడుగులు పడ్డాయని.. ఈ పిడుగుల వల్లే 22 మంది చనిపోయారని వెల్లడించింది. రెండు యావరేజ్ గా రోజులు హీట్‌వేవ్స్, ఒక రోజు కోల్డ్‌వేవ్ పరిస్థితులున్నట్టు తెలిపింది. అంటే ప్రతి ఐదు రోజులకొకసారి మన వాతావరణం తీవ్రంగా మారినట్టు రిపోర్టు స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా కూడా..
మన రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. 273 రోజుల్లో 270 రోజుల పాటు వరదలు, ఎండలతో దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులున్నట్టు స్పస్టం చేసింది. రిపోర్టులో వెల్లడించిన ప్రకారం.. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 99 శాతం రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనే జనాలు బతకాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా తీవ్ర వాతావరణ పరిస్థితులతో 4,064 మంది చనిపోతే.. 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లక్ష వరకు ఇండ్లు కూలిపోగా.. 58,982 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక పొరుగు రాష్ట్రం ఏపీలోనూ వాతావరణ పరిస్థితులు తీవ్రంగానే ఉన్నట్టు రిపోర్ట్ తేల్చింది. అక్కడ 74 రోజుల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులుండగా.. 484 మంది చనిపోయినట్టు తెలిపింది.
అయితే, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎక్కువ రోజులున్న రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 217 రోజులూ దారుణమైన వాతావరణమే ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత కేరళలో147 రోజులు, మధ్యప్రదేశ్‌లో144, మహారాష్ట్రలో140, సిక్కింలో125, కర్నాటకలో 120 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంది. మరణాల సంఖ్యలో మాత్రం మధ్యప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులతో అత్యధికంగా 532 మంది చనిపోయారు. 484 మరణాలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. జార్ఖండ్‌లో 478 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 380 మంది చనిపోయారని నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి..
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో వాతావరణ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు మండిపోయాయి. వర్షాకాలంలో 121 రోజులకుగాను 34 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టు తేల్చింది. 66 రోజులు సాధారణం కన్నా తక్కువగా, 21 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. ఇక, రాత్రి టెంపరేచర్లలో.. 25 రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా రికార్డయినట్టు తేల్చింది. 44 రోజులు సాధారణం కన్నా తక్కువగా, 53 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది.
