‘కళ్లలో కళ్లు పెట్టి చూడు.. గుండెల్లో గుండె కలిపి చూడు.. సందిట్లో బందీవై చూడు..’’అంటూ ఆరుద్ర రాసిన సూపర్ హిట్ పాటను నిజం చేయబోతున్నారు హైదరాబాదీలు. ఎన్టీఆర్, వాణిశ్రీ, శారద నటించిన ‘జీవనచక్రం’ సినిమాలోని పాటను స్ఫూర్తిగా తీసుకున్నారేమో.. ఫిల్మ్ నగర్ లోని ఆరోమలే కేఫ్ స్టూడియో ‘కళ్లల్లో కళ్లు పెట్టి చూడు’ అంటూ జూన్ 20న ఆర్ట్ లైఫ్ ఈవెంట్ ప్లానర్ ‘ఐ’ పేరుతో ఓ ప్రోగ్రామ్ చేయనుంది.
మాటలతో కాకుండా కేవలం కళ్లతోనే ఒక అపరిచితుడితో అనుబంధం ఏర్పడితే ఎలా ఉంటుంది? ఉరుకులు పరుగుల నగర జీవితంలో సోషల్ మీడియా సందడిలో నిజమైన మానవ సంబంధాలు క్రమంగా దూరమవుతున్న ఈరోజుల్లో ఆర్ట్‌లైఫ్ నిర్వహిస్తున్న ఈ ‘ఐ కాంటాక్ట్ ఎక్స్ పీరియన్స్’ ప్రోగ్రామ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇందులో పాల్గొనేవాళ్లు అపరిచితులతో కళ్లతోనే సంభాషిస్తారు. ‘‘మాటలు లేని ఈ నిశ్శబ్ద కలయికలో భావోద్వేగాలు, సున్నితత్వం, మానవత్వం కొత్తగా ఆవిష్కృతమవుతాయ’’ని ఆర్ట్ లైఫ్ ఈవెంట్ ప్లానర్ నిర్వాహకురాలు ప్రవీణ చెప్పారు.
ఐ కాంటాక్ట్ ఎక్స్‌పెరిమెంట్
ఐ కాంటాక్ట్ ఎక్స్‌పెరిమెంట్ అనేది హైదరాబాద్‌కు చెందిన ఆర్ట్‌లైఫ్ ఈవెంట్స్ వంటి గ్రూప్‌లు తరచుగా నిర్వహించే ఒక స్పెషల్ పబ్లిక్ ఇన్‌స్టాలేషన్. ఇది మానవ సంబంధాలను ప్రోత్సహించడానికి రూపొందించిన ఒక సామాజిక మైండ్‌ఫుల్‌నెస్ ప్రాజెక్ట్. ఇందులో ఇద్దరు అపరిచితులు కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చుంటారు. వాళ్లు ఒకరి కళ్లలోకి ఒకరు నేరుగా చూడాల్సి ఉంటుంది. మాట్లాడటం, సంజ్ఞలు చేయడం లేదా ఫోన్‌లను వాడడం వంటివి అనుమతించరు.
లోతైన భావోద్వేగ అనుబంధాన్ని, సున్నితత్వాన్ని అనుభవించడానికి, పాల్గొనేవారు సాధారణంగా 3 నుంచి 7 నిమిషాల పాటు నిరంతరంగా ఈ చూపును కొనసాగిస్తారు. మీరు ఈ ఐ-కాంటాక్ట్ ఈవెంట్‌లో పాల్గొనాలనుకుంటే ఫేస్‌బుక్‌లోని ఆర్ట్‌లైఫ్ ఈవెంట్స్ లేదా ఆర్ట్‌లైఫ్ ఈవెంట్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేరుగా సంప్రదించొచ్చు.
భావోద్వేగ స్పర్శను జోడించడానికి...
ఏ మాటకైనా భావాలను వ్యక్తం చేయడంలో కళ్లు లేదా కంటి చూపుల కలయిక మానవ సంభాషణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, చాలామంది మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూసి మాట్లాడరు. ఒకవేళ చూసినా, అది కేవలం కొన్ని సెకన్లపాటే ఉంటుంది. ఇప్పుడు ప్రజల సంభాషణ తీరును మార్చడానికి సంభాషణలకు ఒక భావోద్వేగ స్పర్శను జోడించడానికి హైదరాబాద్ ఆర్ట్‌లైఫ్ ఈవెంట్స్ సంస్థ ‘ఐ కాంటాక్ట్ ఎక్స్‌పెరిమెంట్ ఇండియా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ప్రజలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు నిమిషాలపాటు ఒకరి కళ్లలోకి ఒకరు నిరంతరాయంగా చూసుకునేలా ప్రోత్సహిస్తోంది. ‘‘ఈ నెల 20న సాయంత్రం 6.15 నుంచి 7.45 గంటల వరకు ఆరోమలే కేఫ్‌లో జరగబోయే ఐ కాంటాక్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాతో చేరండి’’ అంటున్నారు ఈవెంట్ నిర్వాహకులు.
మరీనా ఇన్స్పిరేషన్తో..
జనసంద్రంలో మనం తరచుగా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంటాం. మానవ బంధం ఎక్కడికి పోయింది? మాటలు తరచుగా అబద్ధాలు చెప్పడానికి ఉపయోగపడతాయి.. కానీ కళ్లు ఎల్లప్పుడూ నిజాన్ని బయటపెడతాయి. మనం ఎదుటి వ్యక్తి కళ్లలోకి చూసి వారిని అర్థం చేసుకునే విధానం, మాటలు చెప్పగలిగే దానికంటే ఎంతో లోతైనది అంటారు ఈవెంట్ నిర్వాహకులు. ఈ ప్రయోగానికి సెర్బియాకు చెందిన రచయిత్రి మరీనా అబ్రమోవిక్ స్ఫూర్తి.
ఆమె 2010లో న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో ‘ది ఆర్టిస్ట్ ఈజ్ ప్రెజెంట్’ అనే పేరుతో కళ్లలోకి చూసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె నుంచి స్ఫూర్తి పొంది, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా దేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
