ఫేస్బుక్లో కొలువుల కోత.. మూడో విడత మొదలుపెట్టింది

ఫేస్బుక్లో కొలువుల కోత.. మూడో విడత మొదలుపెట్టింది

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇలా ఒక్కటేమిటి.. టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్ గా ఉద్యోగులకు ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి. క్షణాల్లో సెటిల్ మెంట్లు చేసేసి, వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా మరోసారి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా మరో నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మూడో రౌండ్ లేఆఫ్ ల్లో భాగంగా మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్ లో 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. రెండవ రౌండ్ కోతలో 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్  ప్రకటించారు. ఇప్పటివరకు ఓ టెక్‌ కంపెనీ ఇంత పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. 

కంపెనీ నుంచి తొలగింపునకు గురైన ఉద్యోగులకు 16 వారాల పాటు వేతనం ఇవ్వనుంది మెటా సంస్థ. ఆదాయం తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాలతో మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం, హెచ్‍పీ సహా మరిన్ని దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తీసేశాయి.