ఉద్యోగాల్లో కోత విధించిన ఫేస్ బుక్

ఉద్యోగాల్లో కోత విధించిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ సంస్థ భారీగా ఉద్యోగాల్లో కోత విధించింది. ఒకేసారి 11 వేలమంది ఉద్యోగులను ఫేస్ బుక్ తొలగించింది. ఈ విషయాన్ని.. ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మేటా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు అంశం మెటా చరిత్రలో కఠినమైన రోజుగా ఆయన చెప్పారు. కంపెనీ అనవసర ఖర్చులు తగ్గించుకోవడం పై దృష్టి పెట్టామని.. నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు ఉద్యోగాల భర్తీ ఉండదన్నారు. తొలగించిన ఉద్యోగులకు మార్క్ జుకర్ బర్క్ క్షమాపణలు చెప్పారు. 

రెవిన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి దాదాపు 13 శాతం ఉద్యోగులను తొలగించక తప్పలేదని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. సిబ్బంది తొలగింపు నిర్ణయం కష్టంగానే అనిపించిందని, కానీ సంస్థ ప్రయోజనాల కోసం తప్పలేదని చెప్పారు. అయితే.. తొలగించిన ఉద్యోగులకు 16 వారాల బేస్ పేతో పాటు... పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల జీతాన్ని ఇవ్వనున్నట్లు జుకర్ బర్గ్ తెలిపారు. ప్రస్తుతం మెటాలో 87వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ కూడా దాదాపు 50 శాతం మంది సిబ్బందిని తొలగించారు. అలాగే స్నాప్ యాప్ సంస్థ కూడా 20 శాతం సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.