టీచర్లకు ఎఫ్ఆర్ఎస్.. ఇయ్యాల్టి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్అమలు

టీచర్లకు ఎఫ్ఆర్ఎస్.. ఇయ్యాల్టి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్అమలు
  • ప్రభుత్వ స్కూల్స్ లో మరింతగా పారదర్శకత
  •  ఇప్పటికే విద్యార్థులకు అమలవుతున్న ఎఫ్ఆర్ఎస్​హాజరు ప్రక్రియ 

మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానాన్ని మరింత పారదర్శకత అమలుచేసేందుకు ప్రభుత్వం టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్​ సిస్టమ్​అటెండెన్స్​ను అమలు చేస్తుంది. కొత్తగా తీసుకువచ్చిన ఈ కార్యక్రమంతో ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాల ఆవరణ నుంచి అటెండెన్స్​ వివరాలు అప్లోడ్​ చేస్తేనే, జియో కోఆర్డినేట్​ అటెండెన్స్​ అమలు కానుంది. ఇందుకోసం ప్రతి రోజు ఉపాధ్యాయులు స్కూల్​కు హాజరై ఉదయం, సాయంత్రం వేళల్లో లాగిన్, లాగౌట్​ అవుతూ అటెండెన్స్​ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో తరచూ స్కూళ్లకు డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్​ హాజరు ప్రక్రియ మొదలుకాగా, నేటి నుంచి టీచర్లకూ ఈ అటెండెన్స్​అమలుకానున్నది. 

ఇప్పటికే విద్యార్థులకు అమలు.. 

 ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. ఆ రోజు తరగతిలో ఎంత మంది విద్యార్థులు వచ్చారు. మొత్తం పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, ఏ సమయంలో అటెండెన్స్ తీసుకున్నారనే విషయం ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది. ఫలితంగా మధ్యాహ్న భోజనం నిర్వహణ పారదర్శకంగా అమలు కొనసాగుతుంది. ఇటీవల యాప్ లో స్టాఫ్ అనే పదాన్ని జోడించి, కొద్దిరోజుల పాటు ట్రయల్ నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి టీచర్లకు అమలు చేయాలని ఆదేశాలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. 

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పాఠశాలలు.. 

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ప్రభుత్వ, కస్తూర్భా స్కూల్స్​ 3,237 ఉన్నాయి. అందులో మహబూబాబాద్ జిల్లా​ 872, వరంగల్​ 569, హనుమకొండ 488, జనగామ 464, జయశంకర్​ భూపాలపల్లి 423, ములుగు 421 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. మహబూబాబాద్​జిల్లాలో మొత్తంగా 3604 మంది ఉపాధ్యాయులు విధులను
 నిర్వహిస్తున్నారు.

ప్రతి టీచర్​ హాజరు నమోదు తప్పనిసరి 

ఆగస్టు 1 నుంచి జిల్లాలో ప్రతి ఉపాధ్యాయుడు మొదటగా ఎఫ్ఆర్ఎస్ యాప్ లో ముఖ గుర్తింపు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఉపాధ్యాయుడు ప్రతిరోజూ పాఠశాలకు హాజరైన వెంటనే మొహం ఆధారంగా హాజరు నమోదు చేయాలి. ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ లేదా వెబ్ ప్లాట్​ఫామ్​ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగిస్తాం. నిబంధనల ప్రకారం, వెళ్లేటప్పుడు కూడా ముఖ గుర్తింపుతో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. - రవీందర్​రెడ్డి, మహబూబాబాద్​ డీఈవో