నాలుగు ద‌శ‌ల్లో లాక్ డౌన్: సోష‌ల్ మీడియాలో వైర‌ల్.. నిజ‌మేనా?

నాలుగు ద‌శ‌ల్లో లాక్ డౌన్: సోష‌ల్ మీడియాలో వైర‌ల్.. నిజ‌మేనా?

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి దేశ వ్యాప్తంగా 21 రోజుల‌ లాక్ డౌన్ విధించారు ప్ర‌ధాని మోడీ. ఏప్రిల్ 14వ తేదీకి ఈ గ‌డువు ముగుస్తుంది. అయితే లాక్ డౌన్ ఎత్తేస్తారా? కొన‌సాగిస్తారా? అన్న‌దానిపై ప్ర‌జ‌ల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. అయితే ఇప్ప‌టికే లాక్ డౌన్ ను ఎలా నిలిపేయాల‌న్న దానిపై ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ లో అన్ని రాష్ట్రాల సీఎంల‌ను కామ‌న్ ఎగ్జిట్ స్ట్రాట‌జీ రూపొందించాల‌ని కోరారు. కానీ ఇటీవ‌ల క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ‌డంతో లాక్ డౌన్ కొన‌సాగే అవ‌కాశం ఉందంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. లాక్ డౌన్ ఎలా ఉండాల‌న్న దానిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) ఓ ప్రోటోకాల్ ను అన్ని దేశాల‌కు ఇచ్చిందంటూ ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతోంది.

నాలుగు ద‌శ‌ల్లో…

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు WHO ఒక ప్రోటోకాల్ రూపొందించింద‌ని ఓ పోస్ట్ వైర‌స్ అవుతోంది. నాలుగు ద‌శ‌ల్లో జూన్ 10 వ‌ర‌కు కొన‌సాగుతుంది. తొలి స్టేజ్ లో ఒక్క రోజు ట్ర‌య‌ల్ లాక్ డౌన్ ఉంటుంది. అందులో భాగంగానే బార‌త్ లో మార్చి 22న జ‌న‌తా క‌ర్ఫ్యూ పెట్టారు. స్టేజ్-2లో 21 రోజుల పాటు లాక్ డౌన్ ఆ త‌ర్వాత ఏప్రిల్ 15 నుంచి 19 వ‌ర‌కు ఐదు రోజులు రిలాక్సేష‌న్ ఇస్తారు. మూడో స్టేజ్ లో 28 రోజుల పాటు ఏప్రిల్ 20 నుంచి మే 18 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగించి క‌రోనా కేసుల పెరుగుద‌ల జీరోకు వ‌స్తే పూర్తిగా రిలీఫ్ ఇస్తారు. లేదంటే మ‌ళ్లీ ఐదు రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ మే 25 నుంచి జూన్ 10 వ‌ర‌కు నాలుగో ద‌శ లాక్ డౌన్ పెడ‌తారు అంటూ ఆ పోస్టులో రాసి ఉంది.

నిజ‌మెంత‌..?

సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న ఈ పోస్టు WHO పేరుతో ఉండ‌డంతో ఓ జాతీయ మీడియా సంస్థ‌ WHO ఇండియా ప్ర‌తినిధిని వివ‌ర‌ణ కోరిన‌ట్లు తెలిపింది. ఈ పోస్టు ఫేక్ అని, WHO అలాంటి ప్రోటోకాల్ ఏదీ ఇవ్వ‌లేద‌ని చెప్పారు. అన్ని దేశాలు లాక్ డౌన్ కు ఎక్క‌డిక‌క్క‌డ రూల్స్ పెట్టుకుని ఫాలో అవుతున్న‌ట్లు తెలిపారు.

Fact Check: Viral lockdown phases to control Covid-19 have not been endorsed by WHO