9 నెలల కనిష్టానికి ఫ్యాక్టరీల ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌

9 నెలల కనిష్టానికి ఫ్యాక్టరీల ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ వృద్ధి ఈ ఏడాది  మే నెలలో తొమ్మిది నెలల కనిష్టమైన 1.2 శాతానికి తగ్గింది.  మాన్యుఫాక్చరింగ్, మైనింగ్,  విద్యుత్ రంగాల్లో బలహీనమైన పనితీరే ఇందుకు కారణం.  ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) ద్వారా కొలిచే ఫ్యాక్టరీ ఉత్పత్తి, 2024 మేలో 6.3 శాతం పెరిగింది.

 నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఓ) ఏప్రిల్ నెలకు పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిని గత నెల విడుదల చేసిన 2.7 శాతం అంచనా నుంచి 2.6 శాతానికి సవరించింది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఓ డేటా ప్రకారం, మాన్యుఫాక్చరింగ్ రంగం ఉత్పత్తి వృద్ధి 2025 మేలో 2.6 శాతానికి తగ్గింది.  గత ఏడాది ఇదే నెలలో ఇది 5.1 శాతంగా ఉంది. మైనింగ్ ఉత్పత్తి గత ఏడాది 6.6 శాతం వృద్ధితో పోలిస్తే, ఈ ఏడాది 0.1 శాతం క్షీణతను చవిచూసింది. 

విద్యుత్ ఉత్పత్తి 2025 మేలో 5.8 శాతం క్షీణించగా,  గత ఏడాది ఇదే కాలంలో 13.7 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–మే కాలంలో, పారిశ్రామిక ఉత్పత్తి 1.8 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 5.7 శాతంగా ఉంది.