వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి ప్రియురాలితో బ్రేకప్ లాంటిది.. వెంటనే తేరుకోలేరు: డుప్లెసిస్

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి ప్రియురాలితో బ్రేకప్ లాంటిది.. వెంటనే తేరుకోలేరు: డుప్లెసిస్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఫైనల్లో ఓడిపోయిన సంగతిని తెలిసిందే. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు ఈ సారి కప్ కొట్టడం గ్యారంటీ అనుకున్నా తుది మెట్టుపై బోల్తా పడ్డారు. అంచనాలకు తగ్గట్టు ఫైనల్ కు వెళ్లినా ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. నరేంద్ర మోడీ అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. తాజాగా ఈ ఫైనల్ ఓటమిపై సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ డుప్లెసిస్ స్పందించాడు. 

ఫాఫ్ డుప్లెసిస్ NDTVతో మాట్లాడుతూ.. "మేము 2015 ప్రపంచ కప్‌లో టోర్నీ అంతటా అద్భుతంగా ఆడినప్పటికీ సెమీఫైనల్ లో ఒత్తిడిని జయించలేక ఓటమి పాలయ్యాం. భారత్ సొంతగడ్డపై ఎదురైన ఓటమి తట్టుకోవాలంటే కొంతసమయం పడుతుంది. ఈ ఓటమి ప్రియురాలితో విడిపోవడం లాంటిది. వెంటనే దీనిని అధిగమించాలంటే కష్టం".అని డుప్లెసిస్ 2015 లో తన జట్టు సెమీ ఫైనల్ ఓటమిని గుర్తు చేసుకున్నాడు. 

2015 లో  వరల్డ్ కప్ లో AB డివిలియర్స్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా టోర్నమెంట్‌లో  వరుస విజయాలు సాధించిన సంగతి తెలిసిందే . స్టార్ ప్లేయర్లు డుప్లెసిస్, హషీమ్ ఆమ్లా, క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్, డేల్ స్టెయిన్, మోర్నె మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్, వెర్నాన్ ఫిలాండర్ లతో పటిష్టంగా కనబడిన సఫారీల సెమీస్ లో కివీస్ చేతిలో జట్టు చివరి ఓవర్లో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆటగాళ్లందరూ చిన్న పిల్లల మాదిరి గ్రౌండ్ లోనే వెక్కి వెక్కి ఏడవడం ప్రతి క్రికెట్ అభిమానిని కలచి వేసింది.
 
ప్రస్తుతం అంతర్జాతీయ లీగ్ లు ఆడుతూ బిజీగా మారిన ఫాఫ్..అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు. రెండేళ్లుగా జాతీయ జట్టుకు సెలక్ట్ కాని  ఈ మాజీ కెప్టెన్ 2024 లో వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు అందుబాటులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉంటున్న ఫాఫ్.. ఓపెనర్ గా కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సంగతి తెలిసిందే.