సొంత చెల్లిని గెలిపించుకోలేని ఫెయిల్యూర్ లీడర్: వివేక్

సొంత చెల్లిని గెలిపించుకోలేని ఫెయిల్యూర్ లీడర్: వివేక్
  • అందుకే కేసీఆర్ ఆయనకు సీఎం పదవి అప్పగిస్తలే
  • గట్టుప్పల్‌‌ ఇన్‌‌చార్జ్‌‌గా టీఆర్ఎస్‌‌కు ఎంత లీడ్ తెచ్చారు?
  • అడ్డదారుల్లో గెలిచి.. గొప్ప విజయంగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్
  • తనపై చేస్తున్న ఆరోపణలపై విచారణ చేసుకోవాలంటూ సవాల్

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్ అని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా ఉండి సొంత చెల్లిని గెలిపించుకోలేని అసమర్థుడని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ‘‘కేటీఆర్‌‌‌‌ను సీఎం చేస్తే తెలంగాణలో టీఆర్ఎస్ ఉనికిలోనే ఉండదని కేసీఆర్ గుర్తించిండు. అందుకే సీఎం పదవికి కేటీఆర్‌‌‌‌ను దూరం పెట్టిండు” అని అన్నారు. ఒకవేళ కేటీఆరే సీఎంగా ఉండి ఉంటే.. మునుగోడులో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయేదన్నారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నేతలు సుధాకర్ శర్మ, కిషోర్‌‌‌‌తో కలిసి మీడియాతో వివేక్ మాట్లాడారు. గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న కేటీఆర్ అక్కడ టీఆర్ఎస్​కు ఎంత లీడ్ తీసుకువచ్చారని, దీంతోనే ఆయన నాయకత్వ లక్షణాలు తెలిసిపోయాయని దుయ్యబట్టారు.

అట్టర్ ఫ్లాప్ సర్కారు

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అని, అందుకు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శనమని వివేక్ విమర్శించారు. నైతిక విజయం రాజగోపాల్ రెడ్డిదేనన్నారు. కమ్యూనిస్టులు, పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ గెలిచిందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారని, కోట్ల రూపాయల డబ్బులను పంచారని ఆరోపించారు. పోలింగ్ రోజు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడులోనే మకాం వేశారన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే.. సర్కార్ అమలు చేస్తున్న స్కీంలు బంద్ పెట్టిస్తామని ఓటర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరించారని చెప్పారు. ఇలాంటి అనైతిక చర్యలతో, అన్ని అడ్డదారులతో తక్కువ మెజార్టీతో గెలిచి, దీన్ని కేటీఆర్ గొప్ప విజయంగా  చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా అందరూ.. అడ్డా వేసి ప్రచారం చేసినా స్వల్ప మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిందని.. ఇది ఓ గెలుపేనా అని, దీన్ని గొప్పగా చెప్పుకోవడానికి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలని నిప్పులు చెరిగారు. 

సొంత ఆస్తులను పెంచుకున్నరు

బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు అక్రమ కేసులు పెట్టారని వివేక్ ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో సమన్వయంతో కలిసి పని చేశామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికతో దక్షిణ తెలంగాణలో బీజేపీ బలపడుతుందని, రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 65 నుంచి 70 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. గత ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, సొంత ఆస్తులను పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటేనే వణికిపోతున్న కేసీఆర్, కేటీఆర్.. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతి, అక్రమాలపై ఊరుకునేది లేదని, పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కవిత లిక్కర్ స్కాం త్వరలోనే బయటకు వస్తుందన్నారు.

తప్పుడు ఆరోపణలు చేస్తుండు

అసమర్థ, అవివేక కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదని, అవసరమైతే విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు. ‘‘హైదరాబాద్ కోకాపేటలో మా కంపెనీ కోసం భూమి కొంటే .. హవాలా డబ్బులంటూ  కేటీఆర్ తప్పుడు విమర్శలు చేశారు. నాపై ఒత్తిడి తెచ్చేందుకే పటాన్ చెరులో ఉన్న నా ఫ్యాక్టరీని మూసివేయించారు” అని చెప్పారు. భూమి కొనడం తప్పా అని ప్రశ్నించారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాను డబ్బులు ఇచ్చానని, జమునా హేచరీస్‌‌‌‌‌‌‌‌కు అదే రకమైన సాయం చేశానని కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారన్నారు. గుజరాత్ నుంచి తనకు రెండున్నర కోట్ల రూపాయలు వచ్చాయని కేటీఆర్ చేసిన ఆరోపణలపై విచారణ చేయిస్తే నిజాలేంటో తెలుస్తాయన్నారు.