
హైదరాబాద్, వెలుగు : పదో తరగతి పరీక్షల్లో స్టూడెంట్స్ ఫెయిల్ అయితే అది ఉపాధ్యాయుల తప్పిదమే అవుతుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం కంటే ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. విద్యార్థి టెన్త్ పాస్ అయితేనే జీవితంలో మెరుగైన పరిస్థితిలో ఉంటారన్నారు.
ఎంత వెనకబడిన స్టూడెంట్లకైనా శిక్షణ ఇస్తే మెరుగవుతారని సూచించారు. ప్రతి విద్యార్థికి పాస్ మార్కులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల వెనుకబాటుపై చర్చించి వారికి సూచనలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రోహిణి విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.