రూ.110 కట్టకపోవడంతో ప్రేమ పెండ్లి వాయిదా

రూ.110 కట్టకపోవడంతో ప్రేమ పెండ్లి వాయిదా

తిరువనంతపురం: ఆ యువతీయువకులు ఇద్దరూ ఇష్టపడ్డారు. మతాలు వేరైనప్పటికీ ప్రేమ పెండ్లి చేసుకుని ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ వాళ్లు చేసిన చిన్న పొరబాటు వల్ల పెండ్లి వాయిదాలు పడింది. కేవలం 110 రూపాయల నగదు సమయానికి కట్టకపోవడమే ఈ ఆలస్యానికి కారణం. హైకోర్టు వరకు వెళ్లినా కూడా ముందుగా వాళ్లు అనుకున్న రోజున పెండ్లి చేసుకోలేకపోయారు. ప్రొసీజర్ ప్రకారం రూ.110 కట్టిన తర్వాత నెల రోజులు ఆగాల్సిందేనని చెప్పడంతో ఆగస్టు 9 (సోమవారం) వరకు ఆగకతప్పలేదు.

కేరళకు చెందిన యువతి, యువకుడు ప్రేమ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ యువతి సౌదీ అరేబియాలో నర్సుగా పని చేస్తుండడంతో పెండ్లి చేసుకుని, తన భర్తకూ వీసా తీసుకుని వెంట తీసుకెళ్లాలని అనుకుంది. అయితే వాళ్లిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వాళ్లు. దీంతో కేరళలో వేర్వేరు మతాల వాళ్లు పెండ్లి చేసుకోవాలంటే ఆ రాష్ట్ర స్పెషల్ మ్యారేజ్ యాక్ట్–1958 ప్రకారం లోకల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నోటీసులు ఇవ్వాలి. దీనితో పాటు రూ.110 ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు, నోటీసు అందిన తర్వాత ఆఫీసు నోటీసులు బోర్డులో దానిని పెడతారు. ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే నెల రోజుల తర్వాత పెండ్లి చేసుకోవచ్చు. అప్పుడే వారి పెండ్లిని రిజిస్టర్ చేసి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే ఇక్కడ ఆ జంట జూన్ 11న మ్యారేజ్ ఆఫీసర్‌‌కు నోటీసు పంపారు.. కానీ రూ.110 కట్టలేదు. కొన్ని వారాల తర్వాత పెండ్లి కొడుకు చెక్ చేసుకునేందుకు ఆఫీసుకు వెళ్తే అక్కడ నోటీసు బోర్డులో వాళ్ల వివాహానికి సంబంధించిన నోటీసులు లేదు. విషయం ఏంటని అడిగితే రూ.110 కట్టకపోతే దానిని పరిగణనలోకి తీసుకోలేమని మ్యారేజ్ ఆఫీసర్ స్పష్టం చేశాడు. దీంతో జులై 9న ఆ డబ్బులు కట్టాడు. వాస్తవానికి మొదట పెండ్లి కూతురు జులై నెల చివరిలో సౌదీ నుంచి వచ్చి పెండ్లి చేసుకుని ఆగస్టు 5న జంటగా తిరిగి వెళ్లాలని భావించింది. కానీ ఆ ఫీజు కట్టకపోవడంతో ముందే నోటీసు ఇచ్చినా దానిని లెక్కలోకి తీసుకోవడం కుదరదని, డబ్బులు కట్టిన రోజు నుంచి నెల ఆగాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. 

ముందే పెండ్లి కోసం హైకోర్టులో పిటిషన్

మ్యారేజ్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం అయితే ఆగస్టు 9 వరకు పెండ్లి చేసుకోవడానికి వీలు కాదు. దీంతో ఆ జంట ముందే పెండ్లి చేసుకోవడం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేశారు. కానీ అక్కడ లాభం లేకపోయింది. చట్టం ప్రకారం ఫీజు కట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటారని, ఆ తర్వాత నెల రోజుల నోటీసు ముగిశాకే పెండ్లి చేసుకోవడం వీలవుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆగస్టు 9 వరకు ఎదురుచూడకతప్పలేదు. పెండ్లి వాయిదా పడడంతో మొదట పెండ్లి కుమార్తె సౌదీ నుంచి రావాలనుకున్న డేట్‌ను కూడా వాయిదా వేసుకుంది. ఆగస్టు 9 తర్వాత ఒక మంచి రోజు చూసుకుని పెండ్లి చేసుకుని, వీసా ప్రాసెస్ పూర్తి చేసుకుని త్వరలోనే జంటగా సౌదీ వెళ్తామని పెండ్లి కొడుకు చెబుతున్నాడు.