సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా గౌరారం అగ్రికల్చర్ స్టూడెంట్ వినూత్న ఆవిష్కరణలతో సత్తాచాటుతున్నాడు. చదివేది అగ్రికల్చర్ అయినా కాలుష్య రహిత వాహన తయారీపై ఆసక్తితో బీఎస్సీ సెకండియర్ స్టూడెంట్ కౌశిక్ ఆక్సిజన్‌తో నడిచే ఇంజిన్‌తోపాటు ఏఐ టెక్నాలజీతో సీడ్ జర్మినేషన్ ఆవిష్కరణలు చేశాడు. ఆక్సిజన్‌తో నడిచే ఇంజిన్ మోడల్ తయారు చేయగా దీనికి పేటెంట్ వచ్చింది. ఈ ఇంజిన్‌ను ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లా ఆర్‌అండ్‌డీ టెస్ట్ లు చేస్తోంది. దీంతోపాటు రైతులకు ఉపయోగపడేలా విత్తన నాణ్యత చెక్ చేసేందుకు ఏఐ టెక్నాలజీ తో గుర్తించే విధానాన్ని ఆవిష్కరించాడు.
ఈ విధానంలో విత్తనాన్ని ఫొటో తీసి ఏఐ టెక్నాలజీతో జర్మినేషన్ పరిక్షించవచ్చు. గతంలో విత్తన నాణ్యతా పరీక్షలకు ఎక్కువ సమయం పట్టేది. కౌశిక్ రూపొందించిన ఈ విధానంలో గంటల వ్యవధిలోనే సీడ్ జర్మినేషన్ ను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. కౌశిక్ నైపుణ్యాన్ని గుర్తించిన జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ వచ్చే జూన్ లో కెనడాలో జరగబోయే సమ్మిట్ కు ఆహ్వానించింది. ఏఐ టెక్నాలజీ సాయంతో కౌశిక్ ఈ రెండు ఆవిష్కరణలు చేయడం గొప్ప విషయమని యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆక్సిజన్‌తో నడిచే ఇంజిన్ తయారీలో సుమారు 63 సార్లు ఫెయిలయ్యాయని, అయినప్పటికీ ఇంజిన్ తయారు చేసినట్లు చెప్పాడు. ఇందుకు రూ.18 లక్షలు ఖర్చయినట్లు తెలిపాడు. ఏఐ సాయంతో మనిషిలా ఇంజిన్ ఆక్సిజన్‌ను తీసుకునేలా తయారుచేసినట్లు కౌశిక్ తెలిపాడు.
