Akaay: వందల్లో కాదు.. వేలల్లో: అకాయ్ పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్

Akaay: వందల్లో కాదు.. వేలల్లో: అకాయ్ పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కుమారుడు(అకాయ్) భూమి పైకొచ్చి వారం రోజులు గడిచాయో లేదో కానీ, అతని పేరిట విచ్చలవిడిగా నకిలీ సోషల్ మీడియా ఖాతాలు పుట్టుకొచ్చాయి. అకాయ్, అకాయ్ కోహ్లీ, అకాయ్ విరాట్ కోహ్లీ, అకాయ్ వికోహ్లీ,  అకాయ్ 18కోహ్లీ, అకాయ్ వామిక బ్రదర్.. ఇలా నెటిజెన్స్ ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియా నకిలీ ఖాతాలు సృష్టించారు. ఒకవేళ ఆ పిల్లాడు రేపొద్దున పెరిగి.. పెద్దవాడై సోషల్ మీడియా ఖాతా తెరవాలనుకుంటే 'యూజర్ నేమ్ అందుబాటులో లేదు..' అనే ఆన్సర్ తప్ప మరొకటి కనిపించదు. అంతలా నకిలీ ఖాతాలు సృష్టించారు.

కాగా, విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇటీవల తమ జీవితంలోకి రెండో సంతానాన్ని ఆహ్వానించారు. ఈ నెల 15న అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతనికి వారిద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా అకాయ్‌(Akaay) అని నామకరణం చేశారు. అమరుడు, చిరంజీవుడు అని ఈ పేరు అర్థం.