- నిఖీల అనంతరం ఫేక్మెయిల్స్అని నిర్ధారించిన పోలీసులు
చండీగఢ్/గురుగ్రామ్: పంజాబ్రాజధాని చండీగఢ్‌లో బుధవారం 26 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు ఆయా స్కూళ్లకు చేరుకొని విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. పాఠశాలల చుట్టూ భద్రతను పెంచి తనిఖీలు చేపట్టారు. అయితే, ఆయా పాఠశాలల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, ఆ ఈ మెయిల్స్ఫేక్ అని చండీగఢ్ సీనియర్ ఎస్పీ కన్వర్‌దీప్ కౌర్ తెలిపారు.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎవరూ భయపడవద్దని సూచించారు. 25, 19, 45, 16 సెక్టార్లతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు. దీంతో వెంటనే బాంబు డిస్పోజల్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌లను పాఠశాలల ప్రాంగణానికి తరలించి సోదాలు నిర్వహించామని ఎస్పీ మీడియాకు తెలిపారు.
ఆ ఈ మెయిల్స్ ఒకే జీ మెయిల్ ఖాతా నుంచి వచ్చాయని, చండీగఢ్ పోలీసుల సైబర్ బృందం దానిని పరిశీలిస్తోందని ఆమె చెప్పారు. సెక్టార్ 17 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రాని పాఠశాలలు తెరిచి ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
గురుగ్రామ్‌లో 8 ప్రైవేట్‌స్కూళ్లకు..
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ఎనిమిది ప్రైవేట్ పాఠశాల లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం 7.08 గంటల ప్రాంతంలో ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూళ్ల యాజమాన్యాలు క్యాంపస్‌లను మూసివేశాయి. స్కూల్ బస్సులను నిలిపివేశాయి. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను కూడా వెనక్కి పంపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్డీఆర్ఎఫ్బృందాలు కూడా స్పాట్‌కు చేరుకున్నాయి.
వెంటనే పోలీసు బృందాలు స్నిఫర్ డాగ్‌లతో క్యాంపస్‌లకు చేరుకొని సోదాలు నిర్వహించాయి. కాగా, ప్రాథమిక తనిఖీల అనంతరం ఆయా స్కూళ్లలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని, ఆ మెయిల్స్ఫేక్అని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు.
