యూఎస్ సిటిజన్లే టార్గెట్​గా మెయిల్స్ పంపి ట్రాప్

యూఎస్ సిటిజన్లే టార్గెట్​గా మెయిల్స్ పంపి ట్రాప్

యాంటీ వైరస్ అప్​డేట్ చేస్తమని మోసం
యూఎస్ సిటిజన్లే టార్గెట్​గా మెయిల్స్ పంపి ట్రాప్
కోల్​కతాలో ఫేక్ కాల్ సెంటర్17 మంది అరెస్ట్.. 
 రూ.55 లక్షల విలువైన బిట్ కాయిన్లు స్వాధీనం 

గచ్చిబౌలి, వెలుగు: సిస్టమ్​లో యాంటీ వైరస్ అప్ డేట్ చేస్తామంటూ యూఎస్ సిటిజన్లే టార్గెట్ గా ఫేక్ కాల్ సెంటర్ రన్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ కు చెందిన 17 మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. మియాపూర్ కు చెందిన మహ్మద్ రఫి, కాకినాడకు చెందిన వీరరామ నరేశ్, నిజాంపేటకు చెందిన కల్యాణ్ చక్రవర్తి ముగ్గురు కలిసి గతంలో క్రిప్టో కరెన్సీపై ఆన్ లైన్ ట్రేడింగ్ నిర్వహించేవారు. ఈ క్రమంలో వీరికి వెస్ట్ బెంగాల్ లోని పరగనాస్ జిల్లాకు చెందిన సందీప్ శర్మ()తో పరిచయం ఏర్పడింది. తర్వాత సందీప్ వీరికి కోల్ కతాకు చెందిన మనీశ్ గుప్తా, అమర్ జీత్ గిరి, మహ్మద్ ఇమ్రాన్ ను పరిచయం చేశాడు. వీరంతా కలిసి యూఎస్ సిటిజన్లను యాంటీ వైరస్ అప్ డేట్ పేరుతో ట్రాప్ చేయాలని స్కెచ్ వేశారు. ఇందుకోసం యూఎస్ సిటిజన్లకు ఫేక్ ఈ– మెయిల్స్ పంపాలని సందీప్ శర్మ.. సిటీలో ఉంటున్న రఫి, నరేశ్, కల్యాణ్ ను కోరాడు. ఈ ముగ్గురు యూఎస్ సిటిజన్లకు ఫేక్ మెయిల్ ను పంపేందుకు డార్క్ నెట్ ఈ– మెయిల్ డేటా బేస్ నుంచి  ఓ అకౌంట్ ను కొన్నారు.

బాచుపల్లిలోని విల్లా నుంచి మెయిల్స్ పంపుతూ..

 రఫి, నరేశ్, కల్యాణ్​ బాచుపల్లిలోని ఓ విల్లాను అడ్డాగా చేసుకుని యూఎస్ సిటిజన్లకు అక్కడి నుంచి యాంటీ వైరస్ అప్ డేట్ చేసుకోవాలంటూ ఫేక్ ఈ– మెయిల్స్ ను పంపడం మొదలుపెట్టారు. అందులో వెస్ట్ బెంగాల్ గ్యాంగ్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లను పెట్టి పంపించేవారు. వీరి ట్రాప్ లో పడ్డ యూఎస్ సిటిజన్లు ఆ నంబర్లకు కాల్ చేస్తే మాట్లాడేందుకు  మనీశ్, అమర్ జీత్, ఇమ్రాన్ కోల్ కతాలో ఓ ఫేక్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ను ఓపెన్ చేశారు. ఆ కాల్ సెంటర్ లో కొందరు టెలీ కాలర్స్ ను రిక్రూట్ చేసుకున్నారు. యూఎస్ సిటిజన్లు యాంటీ వైరస్ అప్ డేట్ కోసం కాల్ చేయగానే కాల్ సెంటర్ లోని వ్యక్తులు వీవోఐపీ(వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) ద్వారా మాట్లాడేవారు.  తాము నోట్రాన్ అనే యాంటీ వైరస్ కంపెనీ ప్రతినిధులమని చెప్పేవారు. మీ సిస్టమ్ లో యాంటీ వైరస్ ను అప్ డేట్ చేయాలని ఇందుకోసం కొంత మనీ కట్టాలనేవారు. ఇలా యూఎస్ సిటిజన్లను నమ్మించి వారి నుంచి మనీ ట్రాన్స్ ఫర్ చేయించేవారు. అప్పుడప్పుడు సందీప్ శర్మకు చెందిన పెరూ, యూఎస్, థాయిలాండ్, సింగపూర్ లోని బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేయించేవారు. ఈ అకౌంట్లలో ఉన్న డబ్బును సందీప్ శర్మ బిట్ కాయిన్లుగా మార్చేవాడు. 

కాల్ సెంటర్ పై పోలీసుల దాడులు 

ఈ దందా గురించి తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాచుపల్లిలోని విల్లాపై దాడులు చేశారు. ఫేక్ మెయిల్స్ పంపిస్తున్న నరేశ్, రఫి, కల్యాణ్​ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించి ఫేక్ కాల్ సెంటర్ గురించి తెలుసుకున్నారు. కోల్ కతాలోని ఫేక్ కాల్ సెంటర్ పై దాడులు చేసి సందీప్ శర్మ, మనీశ్, అమర్ జీత్, ఇమ్రాన్ సహా మరో 11 మందిని అరెస్ట్ చేసి వారిని సిటీకి తీసుకొచ్చారు. మొత్తం 17 మందిని అరెస్ట్ చేశామని.. నిందితుల నుంచి రూ. 55 లక్షల విలువైన 3 బిట్ కాయిన్లు, 10 ల్యాప్ టాప్ లు, 20 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.