
హైదరాబాద్ లో ఫేక్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఎ) అధికారులు. జనవరి 3వ తేదీ బుధవారం నగరంలోని ఉప్పల్, దిల్ సుఖ్ నగర్ లో డీసీఏ అధికారులు.. ఫేక్ డ్రగ్స్ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
డీసీఏ డీజి వి బి కమలాసన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్, ఘజియాబాద్ నుంచి ట్రాకాన్ కొరియర్స్ అనే కొరియర్ షిప్పింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్‌కు నకిలీ డ్రగ్స్ వస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఇటీవలే నకిలీ డ్రగ్స్ రాకెట్‌లో నిందితుడైన పువ్వాడ లక్ష్మణ్ పేరుతో వచ్చిన గుర్తించిన డీసీఏ బృందం.. దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్‌లోని కొరియర్ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. పువ్వాడ లక్ష్మణ్ ఆచూకీ కోసం డిసిఎ అధికారులు పోలీసుల సహకారం తీసుకుని.. జనవరి 3వ తేదీ బుధవారం సురేష్ కుమార్ అనే డెలివరీ బాయ్ ద్వారా వచ్చిన ఐదు కొరియర కార్టన్స్ డెలివరీ చేసేందుకు పంపించి.. దిసుఖ్‌నగర్‌లోని ద్వారకాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ అనే గోడౌన్ దాడులు చేశారు.
గోడౌన్ లో రూ. 22.95లక్షల Cefoxim-CV అనే 51వేల యాంటీబయాటిక్ టాబ్లెట్లను డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పువ్వాడ లక్ష్మణ్‌తో పాటు అతని సహచరులు సైదాబాద్‌కు చెందిన పోకల రమేష్, గారపల్లి పూర్ణచందర్‌లను అరెస్టు చేశారు. ‘మెగ్ లైఫ్‌సైన్సెస్, ఖాసారా నెం. 47/5, పల్లి గావ్, సిర్మూర్, హిమాచల్ ప్రదేశ్’ అనే ఫేక్ అడ్రెస్ పేరుతో ఈ ట్యాబ్లెట్‌ల దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.