ఆ స్కానింగ్​ సెంటర్​ది నకిలీ సర్టిఫికెట్

ఆ స్కానింగ్​ సెంటర్​ది నకిలీ సర్టిఫికెట్
  • వెస్టిండీస్​ అధికారులు తాము ఇవ్వలేదన్నారు
  • స్పష్టం చేసిన నల్గొండ హెల్త్​ ఆఫీసర్​

నల్గొండ, వెలుగు : నల్గొండలోని అపర్ణ స్కానింగ్​ సెంటర్​ కేసు కీలక మలుపు తిరిగింది. ఫేక్​ మెడికల్ సర్టిఫికెట్​తో స్కానింగ్​ సెంటర్​ నడిపిస్తున్నారని ఏప్రిల్​ 21న హెల్త్​ ఆఫీసర్లు స్కానింగ్ ​సెంటర్​ను సీజ్​ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వారు హైకోర్టు నుంచి ఆర్డర్​ తెచ్చుకుని రీ ఓపెన్​ చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అధికారులు హైకోర్టులో కౌంటర్​ దాఖలు చేయాల్సి ఉండగా, ఫేక్​ సర్టిఫికెట్​కు సంబంధించి ఆధారాలు కనిపెట్టేందుకు మెడికల్​ ఆఫీసర్లు తీవ్రంగా శ్రమించారు. వారు చేసిన విచారణలో వెస్టిండీస్​నుంచి ఎండీ రేడియోడయాగ్నిస్ట్​ కోర్సు చదివినట్లు సర్టిఫికెట్​ తెచ్చుకున్నారని తేలింది. విచారణలో భాగంగా ఢిల్లీలోని నేషనల్ ​మెడికల్​ కౌన్సిల్​ను కూడా సంప్రదించారు. భారత రాయభార కార్యాలయం ద్వారా వెస్టిండీస్​లోని అధికారులతో మాట్లాడగా వారు తమ దేశానికి చెందినది కాదని చెప్పారని తెలిసింది.
  
త్వరలో అడ్వయిజరీ కమిటీ భేటీ
ఫేక్​సర్టిఫికెట్​ అని తేలడంతో జిల్లా అడ్వయిజరీ కమిటీ త్వరలో భేటీ కానుందని సమాచారం. జిల్లా జడ్జి, కలెక్టర్​, ఎస్పీ, ఎన్జీఓ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ముందు వెస్టిండీస్​ నుంచి సేకరించిన ఆధారాలు సమర్పించి, స్కానింగ్​సెంటర్​పై చర్యలు తీసుకుంటామని హెల్త్​ ఆఫీసర్​ రవిశంకర్​ తెలిపారు. కాగా, స్కానింగ్ ​సెంటర్​పై క్రిమినల్​ కేసులు నమోదు చేశామని టౌ టౌన్​ ఎస్​ఐ రాజశేఖర్​ రెడ్డి తెలిపారు. త్వరలోనే చార్జీషీట్​ ఫైల్​ చేయబోతున్నట్టు చెప్పారు.