ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం... ఆదిలాబాద్ లో రూ.6 కోట్లు వసూలు చేసిన కేటుగాళ్లు

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం... ఆదిలాబాద్ లో  రూ.6 కోట్లు వసూలు చేసిన కేటుగాళ్లు

అమాయకులైన నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని మాయమాటలతో నమ్మించి అందినంత దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో దోచుకునే వారు కొందరైతే..ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో  డబ్బులు వసూలు చేసే వాళ్లు మరికొందరు. లేటెస్ట్ గా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి 6 కోట్లు వసూలు  చేసి బిచాణా ఎత్తివేసింది ఓ ఏజెన్సీ

ఆదిలాబాద్ జిల్లాలో విద్యాంజలి ఏజెన్సీ అనే సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 354 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఇలా 6 కోట్ల వరకు వసూలు చేసిన సంస్థ రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది.  డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలివ్వక పోగా ఆఫీసుల చుట్టూ నిరుద్యోగులను తిప్పించుకున్నారు.  దీంతో నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏజెన్సీకి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసు గురించి విచారిస్తున్నామని జిల్లా ఎస్పీ ఆఖిల్  ‌మహజన్ తెలిపారు.

 డిసెంబర్ 5న హైదరాబాద్ లోని  మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బిచాణాఎత్తేసింది.  మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన  మైండ్ స్పార్క్  అనే కంపెనీ రాత్రికి రాత్రే చేతులెత్తేసింది.   కొండాపూర్ లోని మైండ్స్ స్పార్క్ తో పాటు మాదాపూర్ లో ఫిడిక్షన్ పేరుతో మరో కంపెనీ ఏర్పాటు చేసి నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు నిర్వాహకులు .  ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర నుంచి సుమారు లక్ష నుంచి 2 లక్షలు వసూలు చేశారు. ఇలా  సుమారు 80 నుంచి 100 మంది బాధితులు లక్షలు పోగొట్టుకున్నారు. దీంతో కంపెనీ మెంటర్   శ్రీకాంత్ జోషితోపాటు దిలీప్ శివారెడ్డి పైన మాదాపూర్ పీఎస్ లో   ఫిర్యాదు చేసిన బాధితులు మాదాపూర్ లోని క్యాపిటల్ పార్క్ దగ్గర ఆందోళనకు దిగారు.