కుంభమేళా తరహాలో.. గోదావరి పుష్కరాలు

 కుంభమేళా తరహాలో..  గోదావరి పుష్కరాలు
  • ఏర్పాట్లపై ఫోకస్.. నాలుగు శాఖల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ
  •     గోదావరి తీరం వెంట కొత్త ఘాట్ల నిర్మాణాలు
  •     ప్రైవేట్ సంస్థకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు
  •     పరివాహకంలోని పురాతన ఆలయాల ముస్తాబు

నిర్మల్, వెలుగు:  కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఓ ప్రైవేట్ సంస్థకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 

సదరు సంస్థ పుష్కరాల ఏర్పాట్లతో పాటు 12 రోజుల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టనుంది. నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద ప్రవేశించే గోదావరి నది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 కిలోమీటర్లలో ప్రవహిస్తుంది. దీంతో బాసరతో మొదలై సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం వరకు గోదావరి నది పరివాహకంలో పుష్కరాలు నిర్వహిస్తారు. 

దీంతో బాసర, సోన్, ఖానాపూర్ వద్ద అదనపు ఘాట్లు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో అదనపు ఘాట్ల నిర్మాణాలతో పాటు టాయిలెట్స్, విశ్రాంతి గదులు, తాగునీరు లాంటి సౌకర్యాల కల్పన అవసరముందని గుర్తించిన సంస్థ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా రూపొందించింది. డ్రోన్ల సహాయంతో భద్రతను పర్యవేక్షించడం, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా  రోడ్డు డైవర్షన్ లాంటి చర్యలను చేపట్టనుంది.

 నాలుగు శాఖలతో సమన్వయం...

గోదావరి పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఐదు శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. దేవాదాయ శాఖతో పాటు ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్అండ్ బీ శాఖలు పుష్కరాల ఏర్పాట్లు చేయనున్నాయి. రెవెన్యూ శాఖ పూర్తి సహకారం అందించనుంది. పుష్కర స్నానాల కోసం వచ్చే వీఐపీలకు రెవెన్యూ శాఖ ఫ్రొటోకాల్ ను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ ఐదు శాఖలకు వేర్వేరుగా నిధులు మంజూరు చేయనుంది.  

 పరివాహక దేవాలయాలకు కొత్త రూపు

 బాసర నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవహించే గోదావరి నది పరివాహకంలో ఉన్న చారిత్రక ఆలయాలు కొత్త రూపు సంతరించబోతున్నాయి. పుష్కరాల సందర్భంగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ఆలయాల్లో పూజలు నిర్వహించనున్న నేపథ్యంలో బాసర సరస్వతి ఆలయంతో పాటు ఇక్కడ నది ఒడ్డున ఉన్న సూర్య దేవాలయం, లోకే శ్వరం మండలంలోని బ్రహ్మేశ్వరాలయం, సోన్ గోదావరి తీరంలోని ఆలయంతో పాటు లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్ తీరంలోని అన్ని చారిత్రక ఆలయాలకు రిపేర్లు చేపట్టనున్నారు. ఇందుకు  సంబంధించి దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రతిపాదనలు సైతం రూపొందిస్తోంది.