బంగాళాఖాతంలో వాయుగుండం : చలి చంపుతున్న ఈ కాలంలో ఈ వర్షాలు ఏంటీ..?

బంగాళాఖాతంలో వాయుగుండం : చలి చంపుతున్న ఈ కాలంలో ఈ వర్షాలు ఏంటీ..?

సముద్రంలో వాయుగుండం పెట్టింది. 2026, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం సమయానికి.. ఈ వాయుగుండం చెన్నై సిటీకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ వాయుగుండం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

ఈ తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది వాతావరణ కేంద్రం. తుఫాన్ గా మారితే.. దానికి ఒర్ణబ్ అనే పేరు పెట్టనున్నారు. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతున్న దీని ప్రభావం శ్రీలంక దేశంగా తీవ్రంగా ప్రభావం చూపనుంది. ఇది శ్రీలంక దేశం పొర్టువిల్ దగ్గర తీరం దాటనున్నట్లు చెబుతోంది వెదర్ డిపార్ట్ మెంట్. తీవ్రవాయుగుండంగా మారిన తర్వాత దిశ మార్చుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం అంటున్నారు అధికారులు. మరో 24 గంటల తర్వాత క్లారిటీ వస్తుందని స్పష్టం చేస్తున్నారు అధికారులు. 

బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. జనవరి 10వ తేదీన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఏపీలోని కోస్తా తీరం వెంట ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఏపీలోని దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో జనవరి 10, 11 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ వాయుగుండం ప్రభావం ఉండదని స్పష్టం చేసింది భారత వాతావరణ కేంద్రం. వెదర్ యథావిధిగా కూల్ గా.. ఉదయం పూట పొగ మంచుతో ఉండనున్నట్లు వివరించారు అధికారులు.