
- కేటుగాణ్ని అరెస్ట్ చేసిన కీసర పోలీసులు
- కీసరగుట్ట అడ్డాగా.. ప్రేమజంటల నుంచి డబ్బు వసూళ్లు
- నిందితుడిపై గతంలోనూ పలు కేసులు.
మేడ్చల్ జిల్లా : పోలీసునంటూ ఒంటరిగా దొరికిన ప్రేమ జంటలని బెదిరించి, వారి వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఓ కేటుగాణ్ని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగుట్ట నివాసి అయిన ఉపాధ్యాయ సురేష్ కష్ట పడకుండా, ఈజీగా మనీ సంపాదించాలని ఉద్దేశంతో ఒంటరిగా దొరికిన ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారి వద్ద నుంచి డబ్బు గుంజేవాడు. వారి వీడియోలు తీసి, తాను ఎస్ఓటీ పోలీసునని చెప్పి , బెదిరించి డబ్బు వసూలు చేసేవాడు.
అదే క్రమంలో రామిడి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుండి పోలీస్ అని చెప్పి 5,000/- వసూలు చేయటమే కాకుండా.. కాల్ చేసి పలుమార్లు డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు…ఈ నెల 3వ తేదీన పోలీసులను ఆశ్రయించి, అతనిపై ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సి ఐ నరేందర్ అదేశాల మేరకు నిఘా పెట్టి.. సోమవారం కీసరగుట్ట లో నిందితుణ్ని పట్టుకున్నారు. దర్యాప్తులో నిందితుడు సురేష్ పై గతంలో కూడ సిద్దిపేట పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. అతనిపై పలు కేసులు నమోదు చేసి, అనంతరం రిమాండ్ కు తరలించారు.