ప్రేమ జంటలే టార్గెట్​గా..ఫేక్ పోలీస్ బెదిరింపులు

ప్రేమ జంటలే టార్గెట్​గా..ఫేక్ పోలీస్ బెదిరింపులు
  •     అరెస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్
  •     లక్షల్లో డబ్బులు వసూలు చేసిన సూడో పోలీస్
  •     తెలుగు రాష్ట్రాల్లో 18 కేసులు
  •     నిందితుడిని అరెస్ట్ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్​ఫోర్స్ టీమ్

హైదరాబాద్‌, వెలుగు :  ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్‌ను సిటీ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్‌ టీమ్ బుధవారం అరెస్ట్ చేసింది. అతడి నుంచి రూ.లక్షా 38 వేల క్యాష్, నంబర్ ప్లేట్‌లేని పల్సర్ బైక్​ను స్వాధీనం చేసుకుంది. తర్వాత అతడిని సెక్రటేరియెట్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్‌ డీసీపీ నితికా పంత్‌ తెలిపారు. వరంగల్ జిల్లా మామునూరుకు చెందిన మరాఠీ సృజన్ కుమార్ అలియాస్ సూర్య అలియాస్ చరణ్ (45) జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో ఉంటున్నాడు. ఏపీ, తెలంగాణలో ఇతడిపై 18 కేసులు ఉన్నాయి. మెహిదీపట్నం పరిధి ఆసిఫ్‌నగర్‌‌లో 2008, 2011లో దారిదోపిడీలకు యత్నించాడు. ఈ రెండు కేసుల్లో సృజన్‌పై నాన్‌ బెయిలబుల్ వారెంట్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. ఆసిఫ్‌ నగర్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ వరుస దోపిడీలకు పాల్పడుతున్నాడు. సూడో పోలీస్ యూనిఫాం, ఐడీ కార్డు క్రియేట్ చేసుకున్నాడు.

పార్కులు, ట్యాంక్ బండ్ వద్ద తిరుగుతూ..

ప్రేమ జంటలు ఎక్కువగా కనిపించే నెక్లెస్ రోడ్, ట్యాంక్​ బండ్ సహా సిటీలోని పార్కుల వద్ద సృజన్​కుమార్ తిరిగేవాడు. నంబర్ ప్లేట్‌ లేని పల్సర్ బైక్‌పై సాయంత్రం టైమ్​లో చక్కర్లు కొట్టేవాడు. ఖాళీ ప్రదేశాలు, కార్లు, బైకులపై ఒంటరిగా కూర్చున్న జంటలను టార్గెట్ చేసేవాడు. ఎస్సైగా పనిచేసి చనిపోయిన తన భార్య యూనిఫామ్‌, చేతిలో గన్‌ పట్టుకుని పోజులు ఇచ్చిన ఫొటోను ఆ ప్రేమ జంటలకు చూపించేవాడు. మఫ్టీ పోలీసు అని చెప్పేవాడు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తానని, కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని బెదిరించేవాడు. ఇలా ప్రేమ జంటల నుంచి అందిన కాడికి దోచుకునేవాడు.

రూ.5.20 లక్షలు వసూలు

గత నెల 9న సృజన్ కుమార్ నెక్లెస్ రోడ్​లోని బతుకమ్మ ఘాట్‌కు వెళ్లాడు. కారులో కూర్చుని ఉన్న ఓ జంట దగ్గరికి వెళ్లి పోలీస్​గా పరిచయం చేసుకున్నాడు. అరెస్ట్ చేస్తానని ఆ జంటను బెదిరించాడు. పోలీస్‌ స్టేషన్‌, కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. ఇలా ఆ జంట నుంచి మొత్తం రూ.5 లక్షలు వసూలు చేశాడు. బాధితులు ఇచ్చిన కంప్లయింట్​తో సెక్రటేరియెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 28న మరో జంట వద్ద నుంచి సృజన్  రూ.20 వేలు వసూలు చేశాడు. ఈ రెండు కేసుల్లో అతను వాంటెడ్‌గా ఉన్నాడు. సెంట్రల్‌ జోన్ టాస్క్​ ఫో​ర్స్ పోలీసులు నిఘా పెట్టి బుధవారం ఉదయం నెక్లెస్​రోడ్​లో అతడిని అరెస్ట్ చేశారు.