
- నేరుగా రైతులకు అంటగడుతున్న దళారులు
ఆసిఫాబాద్, వెలుగు: విత్తు దగ్గరే అన్నదాత చిత్తవుతున్నాడు. కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలతో అన్నదాతలను నిండా ముంచుతున్నారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా అక్రమ వ్యాపారానికి పూర్తిస్థాయిలో మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మే 20న దహెగాం మండలంలో 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 7న బెజ్జూర్ మండలం కుకుడ గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 75 కేజీ ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దళారులు ఇప్పటికే పలువురు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినట్లు సమాచారం.
రైతుల వద్దకే దళారులు
నకిలీ విత్తనాలను అరికట్టాలనే ఉద్దేశంతో జిల్లాలో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దళారుల గుట్టుచప్పుడు కాకుండా నేరుగా రైతులకే విత్తనాలు పంపిణీ చేసే విధంగా ప్లాన్చేశారు. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లాలో అటవీ హక్కు పత్రాలు అందకపోవడం గిరిజన రైతులకు శాపంగా మారింది. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం, పెట్టుబడి సాయం సైతం దక్కకపోవడం రైతులను నకిలీల బారిన పడే విధంగా చేస్తోంది. దళారులు గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా రైతుల వద్దకు వెళ్లి విత్తనాలు అంటగడుతున్నారు.
ఖరీఫ్ లో పత్తి పంట ఎంత వేస్తున్నారు. పొలం ఎంత ఉంది, ఎలాంటి విత్తనాలు కావాలో ఆరా తీస్తున్నారు. పత్తి కాయలు పెద్దగా వచ్చేది ఒక ధర, చిన్నగా వచ్చేది కొంచెం ధర తక్కువకే ఇస్తామని చెబుతున్నారు. ఎన్ని ప్యాకెట్లు కావాలో చెబితే తొలకరి జల్లులు పడక ముందే ఇంటికే పంపిస్తామంటున్నారు. ఏజెన్సీలోని కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యు, కౌటాల, బెజ్జూర్, పెంచికల్ పేట్, ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, చింతలమానేపల్లి, దహెగాం మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు ఏటా పత్తి సాగు కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తుంటారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని నకిలీ, లూస్ విత్తనాలు అంటగడుతున్నారు.
జిల్లాలో పత్తి సాగే ఎక్కువ
జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో మొత్తం 4.58 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కందులు, జొన్న, ఇతర పంటలు సాగు చేస్తారని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో అధికంగా పత్తి 3.50 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. గత ఏడాది నకిలీ సీడ్స్ నాటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలో కలుపు అసలు ఉండదని, సీడ్స్ ధర సైతం తక్కువని దళారులు నకిలీలను రైతులకు అంటగడుతున్నారు. పత్తి మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాత ఆశించిన స్థాయిలో లేక నష్టపోతున్నారు.
లైసెన్స్ ఉన్న షాపులోనే కొనాలె
రైతులు లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లోనే సీడ్స్ కొనుగోలు చేయాలి. రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందులు వేయడం వల్ల భూములు పాడైపోతాయి. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుల సహాయంతో తనిఖీలు చేస్తున్నాం. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ విత్తనాలు కొని ఎవరూ నష్టపోవద్దు.
- శ్రీనివాస్ రావు, ఏడీఏ, ఆసిఫాబాద్