ఫాలీ నారీమన్ ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత

ఫాలీ నారీమన్ ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత
  •   న్యాయనిపుణుడిగా ఖ్యాతి 
  •  రాజ్యసభ సభ్యుడిగానూ సేవలు

ఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు ఫాలీనారీమన్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ ఉదయం కన్నుమూశారు. బాంబే హైకోర్టులో 22 ఏళ్లపాటు ప్రాక్టీస్‌ చేసిన ఆయన.. 1971 నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో తన వాదనలు వినిపించారు. అలాగే..  1991 నుంచి 2010 వరకు బార్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు.  అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై గుర్తింపు పొందిన న్యాయనిపుణుడిగా ఫాలీ నారీమన్‌ కు పేరుంది. 

న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 1929లో జన్మించిన ఆయన షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్‌ ఎగ్జామ్స్‌ వైపు అడుగులేశారు. చివరకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవంతో న్యాయవాద వృత్తివైపు అడుగులు వేసి విశేష ఖ్యాతిని గడించారు.