
హాలీవుడ్ పోస్ట్ అపోకలిప్టిక్ డ్రామా వెబ్ సిరీస్ ‘ఫాల్ అవుట్’ సీజన్ 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్‌గా ఈ టెలివిజన్ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. ఎల్లా పర్నెల్, ఆరన్ మోటెన్, వాల్టన్ గోగిన్స్, కైల్ మాక్లాక్లాన్ ప్రధానపాత్రలు పోషించారు. గత సీజన్‌లో కనిపించిన పాత్రలే ఇందులోనూ కొనసాగుతున్నాయి. న్యూక్లియర్ యుద్ధాల ప్రభావంతో ప్రపంచంలో చాలామంది మరణించగా, మిగిలిన వాళ్లలో కొందరు అండర్ గ్రౌండ్స్‌లో ఉండే వాల్ట్స్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి ఓ వాల్ట్ అయిన 33లో ఉన్న లూసీ మ్యాక్లిన్ (ఎల్లా పూర్నెల్)తో పెళ్లికి ఒప్పించిన కొందరు చొరబాటుదారులు, ఆపై వాళ్లపై దాడి చేస్తారు. వాళ్లు తిరగబడడంతో లూసీ తండ్రిని ఎత్తుకెళ్లి భూమిపై ఉన్న వాళ్ల స్థావరంలో బంధిస్తారు.
తండ్రిని తిరిగి తీసుకొస్తానంటూ భూమిపైకి వచ్చిన లూసీకి తన ప్రయాణంలో బ్రదర్హుడ్ ఆఫ్ స్టీల్ మ్యాక్సిమస్ (ఆరోన్ క్లిఫ్టన్ మోటెన్), ముక్కు లేని లెజండరీ ఘూల్ బౌంటీ కూపర్ హావర్డ్ (వాల్టన్ గాగిన్స్)తో పరిచయం అవుతుంది. బయటి ప్రపంచం గురించి తెలియని ఆమె అక్కడి పరిస్థితులను ఎలా ఎదుర్కొంది, తండ్రిని కలుసుకుందా అనేది అసలు కథ. గ్రాహం వాగ్నర్, జెనీవా రాబర్ట్‌సన్ డ్వోరెట్ డైరెక్ట్ చేశారు. జోనాథన్ నోలన్, లిసా జాయ్ నిర్మించారు. డిసెంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.