సాగర్ బరిలో అమరవీరుల కుటుంబాలు

సాగర్ బరిలో అమరవీరుల కుటుంబాలు

సీఎం కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా కొన్నేళ్లుగా పోరాటం
తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1386 మంది ఆత్మబలిదానం
దీంట్లో ప్రభుత్వం గుర్తించింది కేవలం 543 మందినే
270 మందికే ప్రభుత్వ ఉద్యోగం,  ఆర్థిక సాయం

నల్గొండ, వెలుగు : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీకి  తెలంగాణ అమరవీరుల కుటుంబాలు రెడీ అవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తెలంగాణ మలిదశ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా 1386 మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. వీరిలో కేవలం 40 శాతం మందిని మాత్రమే గుర్తించి అందులో కొందరినే ఆదుకున్న ప్రభుత్వం మిగిలిన వారిని వదిలేసింది. దీంతో కొన్నేళ్లుగా ‘తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక’, ‘తెలంగాణ ఉద్యమకారుల వేదిక’ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే డిమాండ్​తో ఏళ్లుగా పోరాడుతున్నారు. అయినా ప్రభుత్వం వీరి మొర ఆలకించడం లేదు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే సాగర్​ బైపోల్​లో 400 మంది అమరవీరుల కుటుంబాలతో నామినేషన్​ వేయించాలని తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక తాజాగా నిర్ణయించడం ఆసక్తిరేపుతోంది.
చెప్పింది కొండంత.. చేసింది గోరంత..
 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఆత్మబలిదానం చేసుకున్న కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, రూ.10 లక్షల ఆర్థికసాయం, ఐదెకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు కావస్తున్నా ఆ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని అమరవీరుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1386 మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్​ఎస్​ సర్కారు కేవలం 543 మందిని మాత్రమే అధికారికంగా గుర్తించింది. ఆత్మహత్యాయత్నం చేసి దివ్యాంగులైన వాళ్లను,  అనారోగ్యం పాలైన వాళ్లను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రం సాధన ఉద్యమంలో భాగంగా చాలా మంది యువకులు, విద్యార్థులు  ఒంటి మీద పెట్రోల్ పోసుకుని, నీళ్లట్యాంకుల పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినవారిలో చాలామంది దివ్యాంగులుగా మారి, దినదినగండంగా బతుకులీడుస్తున్నారు. ఆరోగ్యం సహరించక, వైద్యానికి డబ్బుల్లేక భారంగా బతుకుతున్నారు.
సర్కారు సాయం కోసం ఎదురుచూపులు.. 
 ప్రభుత్వం 543 మందిని అధికారికంగా గుర్తించినప్పటికీ కేవలం 270 కుటుంబాలకే ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు, ఆర్థికసాయం అందజేశారు. మరో 270 కుటుంబాల్లో ఎవరికీ ఉద్యోగానికి అర్హత లేదనే  కారణంతో రూ.10లక్షల సాయం చేశారు. కానీ 843 మందికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. దీనిపై తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. వీళ్లందరికీ ఉద్యోగాలతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం, ఐదెకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. అలాగే ఆత్మహత్య యత్నం చేసుకుని ప్రస్తుతం జీవనర్మ ణ పోరాటం చేస్తున్నవాళ్ల కుటుంబాలకు కూడా అన్ని రకాల సాయం చేయాలని అంటున్నారు. కానీ ప్రభుత్వంపై ఎన్నిరకాలుగా ఒత్తిడి తెస్తున్నా సీఎం పట్టించుకోకపోవడం వల్లే సాగర్ బైపోల్ లో 400 మంది అమరవీరుల కుటుంబసభ్యులతో నామినేషన్​ వేయించాలని  నిర్ణయించినట్లు ఐక్యవేదిక స్టేట్ ప్రెసిడెంట్ రఘుమా రెడ్డి తాజాగా మీడియాకు వెల్లడించారు. 
ఒక్క నల్గొండ నుంచే 70..
సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ నేడు ప్రకటించనున్నారు. మంగళవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఈక్రమంలో సోమవారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిడమనూరు తహసీల్దార్​ఆఫీసులో నామినేషన్ పేపర్లు తీసుకున్నారు. రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్​నగర్​, నల్గొండ ఇలా ప్రతి జిల్లాలో ఉన్న  అమరవీరుల కుటుంబాలతో కలిసి మొత్తం 400 నామినేషన్లు, ఇందులో ఒక్క నల్గొండ జిల్లా నుంచే దాదాపు 70 నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.

అందరూ మద్దతివ్వాలి.. 
సాగర్ బైపోల్​లో  అమరవీరుల కుటుం బాలతో 400 నామి నేషన్లు వేయిస్తున్నాం. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని మేము చేపడుతున్న ఈ కార్య క్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ దళిత సంఘాల జేఏసీ, తెలంగాణ యూత్ ఫోర్స్, తెలంగాణ బతుకమ్మ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అలాగే కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్న వైఎస్ షర్మిళ కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఉద్యమకారుల పక్షాన ఆమె నిలబడాలంటే అమరులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.                                     ‑ ఎం.రఘుమారెడ్డి, ఐక్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్