
- దళిత కుటుంబంపై దారుణం
- 16 ఏండ్ల అమ్మాయి రేప్
- ఆమెతో సహా కుటుంబం మొత్తం హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా గోగ్రి గ్రామంలో ఘోరం జరిగింది. ఓ దళిత కుటుంబంలోని నలుగురిని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. పదహారేండ్ల అమ్మాయితో పాటు ఆమె పదేండ్ల తమ్ముడు, తల్లి (45), తండ్రి (50)ని గొడ్డలితో నరికి చంపేశారు. గురువారం ఉదయం ఎంత పొద్దెక్కినా.. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్కింటి వారు వెళ్లి చూడటంతో విషయం బయటపడింది. ఇంటిల్లిపాది రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. హత్య చేసే ముందు అమ్మాయిపై అత్యాచారం చేశారని, పొరుగు ఇంట్లో ఉండే ఓ అగ్రవర్ణ కుటుంబమే ఈ పని చేయించిందని మృతుల బంధువులు ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు11 మందిపై గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులు ఫైల్ చేశారు. పలువురిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితులు పదునైన గొడ్డలి, కత్తులతో దాడి చేసి ఈ హత్యలు చేశారని, ముగ్గురి మృతదేహాలు హాల్‌లో ఉండగా, అమ్మాయి డెడ్‌బాడీ లోపలి గదిలో ఉందని పోలీసులు చెప్పారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
భూ వివాదాలే కారణమా?
మృతుల ఇంటి పక్కన ఉండే ఓ అగ్రవర్ణ కుటుంబంతో వాళ్లకు కొన్నాళ్లుగా భూమి విషయంలో గొడవ ఉందని బాధితుల బంధువులు చెబుతున్నారు. 2019 నుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయని, రెండు నెలల క్రితం బాధిత కుటుంబంపై దాడికి కూడా పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. కేసును తొక్కిపెట్టి, నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 21న వాళ్లు బాధిత కుటుంబం ఇంట్లోకి వచ్చి కొట్టినప్పుడు ఫిర్యాదు చేసినా సీఐ పట్టించుకోలేదని, నిందితుల ఇంట్లో కూర్చుని కేసు కాంప్రమైజ్చేసే ప్రయత్నం చేశారన్నారు. వారం రోజులు పోరాడిన తర్వాత గానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదని, నిందితులు కూడా రివర్స్ కేసులు పెట్టారని ఆరోపించారు.