కొవిడ్ పేషెంట్లకు మందును ఫ్రీగా ఇస్తాం

కొవిడ్ పేషెంట్లకు మందును ఫ్రీగా ఇస్తాం

కృష్ణపట్నం: కరోనాకు విరుగుడుగా తాను తయారు చేసిన మందును పాజిటివ్‌ పేషెంట్లకు ఉచితంగా అందిస్తానని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య అన్నారు. ప్రతి జిల్లాలో 5 వేల మంది కొవిడ్ పేషెంట్లకు మందును ఫ్రీగా పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రేపటి నుంచి పంపిణీ ప్రక్రియ మొదలవుతుందన్నారు. సర్కార్ నియమించిన సమయంలో మందును ఇస్తామన్నారు. ఇందులో భాగంగా అవసరమైన మందును ఈ రోజు సాయంత్రానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికీ మందును ఇస్తామని పేర్కొన్నారు. 

సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గోవర్దన్ రెడ్డి ఆదేశాల మేరకు పంపిణీని ఇక్కడి నుంచి మొదలుపెడుతున్నామని చెప్పారు. మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున సర్కారు సహాయ, సహకారాలతో తెలుగు రాష్ట్రాల్లో మందు పంపిణీని వేగవంతం చేస్తామన్నారు. పాజిటివ్ పేషెంట్ల డేటాను సేకరించి ప్రభుత్వం ద్వారా వారికి మందును పంపిణీ చేయాలని సంకల్పించామని వివరించారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ జరుగుతుందని చాలా మంది ప్రజలు ఇక్కడకు వస్తున్నారని, కానీ ఇక్కడ పంపకం జరగడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో మందు పంపిణీ చేస్తున్నందున పాజిటివ్ రోగులు అక్కడి డేటాలో నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు. కాగా ఆనందయ్య కరోనా మందుకు ‘ఔషధచక్ర’గా పేరు పెట్టారు.