ఏపీకి ‘ఫణి’ ముప్పు

ఏపీకి ‘ఫణి’ ముప్పు

ఫణి తుపాన్‌ తీరంవైపు వేగంగా దూసుకువస్తోంది. ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ కదులుతున్న తుపాన్‌తో ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ కేంద్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకలోని ట్రింకోమలికి 750 కిలోమీటర్లు, చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచిలీపట్నంకు 1260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో బలపడి పెను తుపాన్‌గా మారే అవకాశం ఉందని, 30వ తేదీ నాటికి దిశ మార్చుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

తుపాన్‌ ప్రభావం కారణంగా బంగాళా ఖాతంలో 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఈ వేగం 90 నుంచి 115 కిలోమీటర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సోమవారం వరకు గాలుల వేగం 145 నుంచి 175 కిలోమీటర్లకు పెరిగి ఆ ప్రభావం ఏపీ తీరంతోపాటు తమిళనాడు, పుదుచ్చేరిపై కనిపిస్తుందంటున్నారు. మే రెండో తేదీ నాటికి గాలుల వేగం కాస్త తగ్గే అవకాశం ఉందంటున్నారు. కాగా తుపాన్‌ హెచ్చరికల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు.