
ఆసియా కప్ సూపర్–-4 రౌండ్‌లో ఇండియా, పాకిస్తాన్ మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ పై ఎప్పటిలాగే భారీ హైప్ నెలకొంది. సూపర్-4 కావడంతో ప్రతి మ్యాచ్ గెలవడం కీలకమే. ఈ నేపథ్యంలో బలహీనమైన పాకిస్థాన్ పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చూపించాలని చూస్తుంటే.. ఈ సారి ఎలాగైనా ఇండియాకు షాక్ ఇవ్వాలని పాకిస్థాన్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ భారీ తేడాతో గెలిస్తే ఫైనల్ కు వెళ్లొచ్చు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం..
గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా సూపర్–4 రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ పాకిస్తాన్‌పై మరోసారి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రానుండటంతో ఇండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. అయితే, ఒమన్‌తో మ్యాచ్‌లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో తలకు గాయమైన ఆల్-రౌండర్ అక్షర్ పటేల్ ఫిట్‌నెస్‌పై కొంత ఆందోళన నెలకొంది. అక్షర్ అందుబాటులో లేకపోతే, తన స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
పాక్ జట్టులో హారీస్ రౌఫ్:
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మూడో స్పిన్నర్ సూఫియన్ బదులు రవూఫ్‌ను బరిలోకి దించే చాన్సుంది. ప్రస్తుత జట్టులో ఫఖర్ జమాన్, షాహీన్ అఫ్రిది మాత్రమే మెరుగ్గా ఆడుతున్నారు. సాహిబ్జదా ఫర్హాన్, హసన్ నవాజ్ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, బౌలింగ్‌లోనూ పాక్ ఆశించిన మేర రాణించడం లేదు. షాహీన్ ఆఫ్రిదిపై అతిగా ఆధారపడి బోల్తా కొడుతోంది. ఇక కీలక సమయాల్లో ఒత్తిడికి చిత్తవడం పాక్‌ను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాతో పోరుకు ముందు పాక్ ఆటగాళ్ల కోసం మోటివేషన్ స్పీకర్ రహీల్ కరీం సేవలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా:
అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, శాంసన్ (వికెట్ కీపర్), దూబే, పాండ్యా, అక్షర్/సుందర్/అర్ష్‌దీప్, కుల్దీప్, బుమ్రా, చక్రవర్తి.
పాకిస్తాన్:
ఫర్హాన్, సైమ్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆగా (కెప్టెన్), హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, షాహీన్ షా, రవూఫ్, అబ్రార్.