
న్యూఢిల్లీ: జీఎస్టీ 2.0 సంస్కరణల అమలుతో రేపటి (సెప్టెంబర్ 22) నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలు కానున్న నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 21) ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలతో పాటే దేశంలో జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి రానున్నాయని శుభవార్త చెప్పారు.
సోమవారం నుంచి (సెప్టెంబర్ 22) దేశంలో జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం అవుతోందని తెలిపారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నిత్యవసర సరుకులపై ధరలు భారీగా తగ్గుతాయన్నారు. జీఎస్టీ మార్పులతో వ్యాపారులు, తయారీదారులకు కూడా మేలు జరుగుతుందన్నారు. దేశమంతా సంతోషడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధి రేటుకు, ఆత్మనిర్భర్ భారత్కు మరింత ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి కొత్త చరిత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోందని అన్నారు. గతంలో దేశంలో రకరకాల పేర్లతో ఎన్నో పన్నులు ఉండేవని.. అన్ని రకాల పన్నలను రద్దు చేసి 2017లో జీఎస్టీ తీసుకొచ్చామని గుర్తు చేశారు.
జీఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ కల సాకారమైందన్నారు. ఇటీవల దేశంలోని అన్ని వర్గాలతో చర్చించి జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని.. రాష్ట్రాలతో చర్చించాకే ఇంత పెద్ద సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పన్నులు మరింత సులభంగా మారాతాయని పేర్కొన్నారు.