SRH vs LSG: రాహుల్‌కు పెరుగుతున్న మద్దతు.. RCB జట్టులోకి రావాలని ఫ్యాన్స్ డిమాండ్

SRH vs LSG: రాహుల్‌కు పెరుగుతున్న మద్దతు.. RCB జట్టులోకి రావాలని ఫ్యాన్స్ డిమాండ్

ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. మొదట బ్యాటింగ్ లో విఫలమై ఒక మాదిరి స్కోర్ కు పరిమితమైన రాహుల్ సేన.. ఆ తర్వాత బౌలింగ్ లో దారుణంగా విఫలమైంది. ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపకపోవడంతో 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఓపెనర్లు కేవలం 9.4 ఓవర్లలోనే ఫినిష్ చేశారు.  ట్రావిస్ హెడ్ (89 నాటౌట్), అభిషేక్ శర్మ (75 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో యజమాని సంజీవ్ గోయెంకా తన సహనాన్ని కోల్పోయాడు. 

రాహుల్ కెప్టెన్సీని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటమి అనంతరం రాహుల్ వద్దకు వచ్చిన సంజీవ్.. ఏం ఆటయ్యా అది.. బౌలర్లు, ఫీల్డర్లను సరిగా ఉపయోగించుకోకుండా చెత్త కెప్టెన్సీ చేస్తున్నావ్  అంటూ తిడుతున్నట్లు..  గ్రౌండ్ లోనే అతనిపై అసహనంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ ఎదో చెప్పేందుకు ప్రయత్నించినా సంజీవ్ వినిపించుకోకుండా రాహుల్ పై కోపడ్డాడు. సంజీవ్ మాట్లాడేటప్పుడు.. రాహుల్ చాలా అసౌకర్యంగా ఫీలైనట్లు వీడియోలో కనిపించింది.

ప్రస్తుతం సంజీవ్ గోయెంకాపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన రాహుల్ ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదని అతనిపై మండిపడుతున్నారు. ఫ్యాన్స్ దగ్గర నుంచి రాహుల్ కు మద్దతు పెరుగుతుంది. నువ్వు ఆర్సీబీ జట్టులోకి వచ్చేసేయ్ అని కొందమంది అంటుంటే.. ఆర్సీబీ జట్టు ఓనర్ చాలా మంచి వాడని నీకు కెప్టెన్సీతో పాటు ఎలాంటి ఒత్తిడి ఉండదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఆర్సీబీ జట్టులో ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదంటున్నారు. ఆర్సీబీ జట్టులో ఓడిపోయినా నిన్ను ఎవరు ఏమీ అనరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లకే  చేధించారు. అభిషేక్ శర్మ(75 నాటౌట్: 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్ లు), ట్రావిస్ హెడ్(89 నాటౌట్: 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లు) పరుగులు చేశారు. అంతకుముందు లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.