భారత జట్టుకు గోల్డ్ ఎలా ఇస్తారు.. మ్యాచ్ జరుగుంటే మేమే గెలిచేవాళ్లం!: ఆఫ్ఘన్ పేసర్

భారత జట్టుకు గోల్డ్ ఎలా ఇస్తారు.. మ్యాచ్ జరుగుంటే మేమే గెలిచేవాళ్లం!: ఆఫ్ఘన్ పేసర్

చైనా, హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియన్ గేమ్స్ క్రికెట్ పోటీల్లో భారత జట్లు స్వర్ణపతకాలు సాధించిన విషయం తెలిసిందే. మహిళల జట్టు ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేయగా.. పురుషుల జట్టు టాప్ ర్యాంకు ఆధారంగా విజేతగా నిలిచింది. ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడడంతో అంపైర్లు.. మెరుగైన ర్యాంకు ఆధారంగా భారత జట్టును విజేతగా ప్రకటించారు. ఇది గడిచి వారం రోజులు పూర్తవ్వగా.. ఈ నిర్ణయం సరైనది కాదంటూ ఓ ఆఫ్ఘన్ పేసర్ తెరమీదకు వచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ 52 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో షాహీదుల్లా కమల్(49), గుల్బాద్దీన్ నయీబ్(27) జోడి ఆరో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆపై 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగుల దగ్గర వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. అటుమీదట వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు.. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి,  మెరుగైన ర్యాంకు ఆధారంగా భారత జట్టును విజేతగా ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం తమను బాధ పెట్టిందని ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ మాలిక్ వెల్లడించాడు.

స్వర్ణ పతకాన్ని సగం సగం పంచుకోవాలి

ఏషియన్ గేమ్స్‌లో ఆడడం చాలా చక్కగా అనిపించిందన్న ఫరీద్ మాలిక్, తమ జట్టు స్వర్ణ పతకాన్ని చేజార్చుకోవడం పట్ల సంతోషంగా లేమని తెలిపాడు. స్వర్ణ పతకాన్ని భారత్, అఫ్ఘాన్ జట్లు సమంగా పంచుకోవాల్సిందని వెల్లడించాడు. ఆ పరిస్థితులలో తమ జట్టుకు మెరుగైన రన్ రేట్ ఉంటే విజేతగా ప్రకటించేవారా..! అని ప్రశ్నించాడు. 

ALSO READ: Cricket World Cup 2023: స్టార్ హీరో మాస్టర్ ప్లాన్: భారత్-పాక్ మ్యాచుకు హాజరవ్వడానికి కారణం అదేనా 

"ఏ టోర్నీ అయినా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ కూడా అదే అనుసరించాలి. స్వర్ణం పతకాన్ని సగం సగం ఇవ్వాల్సింది. ర్యాంక్ ఆధారంగా స్వర్ణ పతక విజేతను నిర్ణయించడం సరైనది కాదు. ఏమో.. మ్యాచ్ జరుగుంటే మరోలా ఉండేదేమో..! పాకిస్తాన్‌ని, శ్రీలంక జట్లను మేం అలానే ఓడించాం.." అని ఫరీద్ మాలిక్ తెలిపాడు.

చైనా అభిమానులకు క్రికెట్ నాలెడ్జ్ లేదు

ఇక చైనాలో క్రికెట్ ఆడటంపై స్పందించిన ఈ బౌలర్.. మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వచ్చిన చాలా మందికి క్రికెట్ నాలెడ్జ్ లేదని తెలిపాడు. సిక్సర్ కొట్టినా చప్పట్లే..ఓటైనా చప్పట్లు కొట్టడంతో  వారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. ఇక క్వార్టర్ ఫైనల్‌లో శ్రీలంకను, సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడించిన ఆఫ్ఘన్ జట్టు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కింద ఉన్న కారణంగా రజతంతో సరిపెట్టుకుంది.