ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరే ప్రాణాలు విడిచిన రైతు

 ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరే ప్రాణాలు విడిచిన రైతు

కామారెడ్డి జిల్లాలో ఓ ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరే ఓ రైతు ప్రాణాలు వదిలాడు. లింగంపేట్ మండలంలోని వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర ఐలాపూర్ కు చెందిన రైతు భీరయ్య.. ధాన్యం కుప్పపై గుండెపోటుతో కుప్పకూలాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట దగ్గరే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వారం రోజుల కిందట వడ్లను కొనుగోలు సెంటర్ కు తీసుకొచ్చాడు రైతు. రోజూ వడ్ల కుప్ప దగ్గర కాపలా ఉంటున్నాడు. నిన్న రాత్రి ఇంటికి వెళ్లి అన్నం తిని మళ్లీ సెంటర్ కు వచ్చి వడ్ల కుప్ప దగ్గరే నిద్రపోయాడు. ఉదయం రైతు భీరయ్య ఇంటికి రాకపోవటంతో ఆయన భార్య.. కొనుగోలు సెంటర్ కు వచ్చి చూసింది. అప్పటికీ భీరయ్య నిద్ర లేవలేదు. ఆమె ఎంత లేపినా ఆయన మేల్కోలేదు. దీంతో భీరయ్య గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ప్రభుత్వం వడ్లు కొంటున్నామని..ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటూ పోతుంది. కానీ గ్రౌండ్ లో పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు రైతులు. వడ్లు కొంటున్నారని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు అన్నదాతలు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తూ ఓ రైతు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.