
స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చంద్రుతండాకు చెందిన బానోతు సుమన్(27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. జీతం సరిపోకపోవడంతో తిరిగి చంద్రుతండాకు వచ్చి తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడి ఖర్చులతో పాటు తన ఏడాదిన్నర బాబుకు గుండె ఆపరేషన్ కోసం బ్యాంకులో, ప్రైవేటుగా రూ.12 లక్షల అప్పు చేశాడు. వీటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందిన సుమన్.. గత మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.