రైతు బీమా సక్కగ అందుతలె..బీమా నమోదు సైట్‌ క్లోజ్‌

రైతు బీమా సక్కగ అందుతలె..బీమా నమోదు సైట్‌ క్లోజ్‌
  • గతేడాది 690 కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం రాలె
  • అందరికి సరిపడా ప్రీమియంను సర్కారు కట్టకనే..
  • బీమా నమోదు సైట్‌ క్లోజ్‌.. కొత్తోళ్లకు నో చాన్స్‌

హైదరాబాద్‌, వెలుగురైతు బీమా పథకం రైతన్నల కుటుంబాలను ఆదుకోవట్లేదు. రకరకాల కారణాలతో చాలా మందికి బీమా పరిహారం అందట్లేదు. అప్లై చేసుకున్నా ఎల్​ఐసీ ఐడీలు రాక, ఐడీలు వచ్చినా సర్కారు కట్టిన బీమా ప్రీమియం సరిపోక బీమా క్లెయిమ్​కు అనర్హులవుతున్నారు. గతేడాది ఇలా 690 మందికి బీమా పరిహారం రాలేదు. ఈ రైతుల కుటుంబాలు నెలల తరబడి అగ్రికల్చర్ కమిషనరేట్ చుట్టూ తిరుగుతున్నా సర్కారు, అధికారుల నుంచి స్పందన లేదు. బీమా నమోదు చేసుకునే సైటు పని చేయక ఎంతో మంది రైతులు అప్లై చేసుకోలేకపోతున్నారు.

అప్‌లోడ్‌ అయినయ్‌.. ఐడీలు రాలె

రైతు అకాల మరణం పొందితే వాళ్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని సర్కారు తీసుకొచ్చింది. ఏ కారణంగా చనిపోయినా రూ. 5 లక్షల బీమా వర్తించేలా ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకుంది. రైతు మరణించిన 24 గంటల్లో పరిహారం అందేలా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతుల వివరాల ఆధారంగా ప్రభుత్వం ముందే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. దాంట్లోంచి బీమా ప్రీమియంను ఎల్‌ఐసీ కట్‌ చేసుకుని ఐడీలు ఇస్తుంది. అయితే బీమా ప్రీమియం డబ్బుల కన్నా ఎక్కువ మంది రైతుల వివరాలు సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకుంటే లేట్​గా నమోదు చేసుకున్న వాళ్లకు ఐడీలు రావట్లేదు. అలాంటి వాళ్లకు ఇన్సూరెన్స్‌ కూడా అందట్లేదు. ఇలా 2019–20 సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 690 క్లెయిమ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. బీమాపై రైతులకు అవగాహన కల్పించక పోవడం, కింది స్థాయి అధికారులు (ఏఈవోలు) అప్‌లోడ్‌ చేసినా ఉన్నత స్థాయిలో జాప్యంతో ఎల్‌ఐసీ ఐడీలు రాక కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఎదురవుతోంది.

ఐడీలు వచ్చినా క్లెయిమ్స్​ కావట్లే

గత సీజన్‌లో బీమా ప్రీమియం డబ్బులను అందరికీ సరిపోయేలా కట్టకనే ఇలాంటి ప్రాబ్లమ్​వచ్చిందని తెలిసింది. ప్రధానంగా 2019 డిసెంబర్ నెల నుంచి 2020 ఆగస్టు 13 వరకు ఎన్‌రోల్‌ చేసుకున్న రైతులకు సర్కారు చెల్లించిన ప్రీమియం సరిపోక సమస్య ఎదురైంది. వీళ్ల వివరాలు సైట్‌లో ఉన్నా, ఐడీలు వచ్చినా క్లెయిమ్స్‌ రావడం లేదని క్షేత్రస్థాయి అధికారులు చెప్పారు. గత ఆగస్టులో ఎల్‌ఐసీ ఐడీలు రాని కుటుంబాలకు సంబంధించిన సమస్యను వ్యవసాయ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. స్పెషల్‌ కేసు కింద పరిగణలోకి తీసుకుని ఎల్‌ఐసీతో మాట్లాడి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని లెటర్ రాసింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన 6 నెలల లోపు చనిపోయిన వారికీ క్లెయిమ్‌ చేసుకునే వీలున్నట్లు సమాచారం. కానీ 2 నెలలుగా దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోక పోవడంతో వందలాది కుటుంబాలకు పరిహారం అందలేదనే విమర్శ ఉంది.

ఈ ఏడాది సెప్టెంబర్ తర్వత అప్లికేషన్స్​ క్లోజ్​

2020–21 రైతు బీమా ఆగస్టు 14 నుంచి స్టార్టయింది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చిన రైతులు బీమాకు అప్లై చేసుకోవడానికి వ్యవసాయ శాఖ ఆగస్టులో అనుమతిచ్చింది. సెప్టెంబర్ ఫస్ట్‌ వీక్‌ వరకు నమోదుకు చాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి బీమా నమోదు ఆప్షన్ క్లోజ్‌ చేయడంతో చాలా మందికి బీమా లభించే అవకాశం దొరకలేదు. దీంతో ఈ ఏడాది 32.73లక్షల మంది రైతులకే బీమా నమోదైంది. బీమా ప్రీమియం రూ.3,486.90 చొప్పున రూ.1,141.44 కోట్లు సర్కారు చెల్లించింది. గత ఫిబ్రవరిలో బీమా నమోదు ఆప్షన్‌ తొలగించడంతో 6 నెలలుగా కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చిన వారికి బీమా నమోదుకు వీల్లేకుండా పోయింది.

పరిహారం అందక ఇబ్బందులు

శంషాబాద్‌ మండలంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా వారి క్లెయిమ్స్‌ రాలేదని తెలిసింది. మృతి చెందిన రైతు కుటుంబాలు ఆఫీసుల చుట్టూ తిరిగినా స్థానిక అధికారులు ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో అధికార పార్టీ నేత తల్లి మరణించగా బీమా పరిహారం కోసం కమిషనరేట్‌ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఓ మంత్రి పేషీలో బంధువు చనిపోయినా ఇదే పరిస్థితి. భూమి ఉన్న కొందరు ఊర్ల నుంచి ఉపాధికి పట్టణాలకు వెళ్తున్నారు. దీంతో వాళ్ల వివరాలు సైట్‌లో అప్‌లోడ్‌ కాక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మహబూబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పరిధిలోని అర్పనపల్లి పక్కనున్న తండా వాసి మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉండే ఆయనకు గూడురు క్లస్టర్‌ పరిధిలో భూమి ఉన్నా వివరాలు నమోదు చేయక వారి కుటుంబం బీమా కోల్పోయింది.