
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫర్టిలైజర్ ఓనర్ల నిర్వాకం
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఫర్టిలైజర్ షాప్ ఓనర్లు యూరియా అమ్ముతూ పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామంలో లారీలో వచ్చిన యూరియా బ్యాగులను అన్ లోడ్ చేస్తుండగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్ అక్కడికి చేరుకొని లారీని కాగజ్ నగర్ డీఎస్పీ ఆఫీస్ కు తరలించారు.
మరోవైపు కౌటాల మండలం శీర్ష గ్రామంలోని రెండు ఫర్టిలైజర్ షాపులకు అర్ధరాత్రి యూరియా రావడంతో తెల్లారేసరికి స్టాక్ పంపిణీ చేశారు. గ్రామంలోని కొండయ్య ట్రేడర్స్, శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ ఓనర్లు 266 బస్తాల చొప్పున యూరియాను బ్లాక్ లో తెప్పించారు. శనివారం ఉదయం గ్రామానికి చేరుకున్న ఏవో ప్రేమలత.. కొండయ్య ట్రేడర్ లో ఉన్న 46, ఆంజనేయ ట్రేడర్స్ లో ఉన్న 76 బస్తాల యూరియాను సీజ్ చేసి స్టాప్ సేల్ విధించారు. నిబంధనలకు విరుద్ధంగా యూరియా అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కాగజ్ నగర్ ఏడీఏ మనోహర్ తెలిపారు.