నిద్రలోనే పాణాలు తీసిన్రు..అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

నిద్రలోనే పాణాలు తీసిన్రు..అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త
  • తప్పతాగి కన్నతల్లిని కొడవలితో కొట్టి చంపిన కొడుకు
  • ఆపై కాళ్ల కడెలు తీసి దాచిపెట్టిండు
  • మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోవేర్వేరు చోట్ల ఘటనలు

మల్కాజిగిరి/చేవెళ్ల, వెలుగు: అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో అనుమానం హత్యకు దారితీసింది. కట్టుకున్న భర్తే.. భార్యను కత్తితో గొంతు కోసి కడతేర్చాడు.  మరోచోట తప్పతాగి ఇంటికి వచ్చిన కొడుకు.. తనకు భూమి రాసి ఇయ్యలేదని కన్నతల్లిని కొడవలితో కొట్టిచంపాడు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి వేర్వేరు చోట్ల ఈ ఘటనలు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూర్​కు చెందిన బోడ శంకర్​, మంజుల(35) దంపతులు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉండగా, ఉపాధి కోసం ముంబైకి వెళ్లి వచ్చారు.

 కొంతకాలంగా శంకర్ అనుమానంతో భార్యను తరచూ తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. వేధింపులు భరించలేక ఆమె వారం కింద మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలోని మహేశ్‌నగర్​లో ఉంటున్న తన అక్క రాణి ఇంటికి వచ్చింది. తర్వాత శంకర్ కూడా తన కొడుకులతో కలిసి అక్కడికి వెళ్లాడు. శుక్రవారం పెద్దల సమక్షంలో చర్చించిన తర్వాత ఇకమీదట మంజులను ఇబ్బంది పెట్టనని చెప్పి మాట ఇచ్చాడు. కానీ అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో కత్తితో విచక్షణారహితంగా భార్యను గొంతు కోశాడు. ఆమె అరుపులకు అందరూ లేవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భూమి రాసి ఇయ్యలేదనే..!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని రేగడి ఘనపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మ (70)కు నలుగురు కొడుకులు. తన భర్త పేరిట రెండెకరాల భూమి ఉండగా, ఆయన చనిపోయిన తర్వాత ఎకరం భూమిని ముగ్గురు కొడుకుల పేరిట చేసింది. మరో ఎకరం తనపై పేరుపై చేయించుకుంది. అయితే, తన పేరిట భూమి చేయించలేదని చిన్నకొడుకు జంగయ్య తల్లిపై కక్ష పెంచుకున్నాడు. గతంలో ఓ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ పనిచేసిన జంగయ్య.. నెలరోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. 

ఈక్రమంలో తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి తప్పతాగి ఇంటికి వచ్చి.. ఉన్నట్టుండి నిద్రలో ఉన్న తల్లి నర్సమ్మ (70)ను తలపై కొడవలితో కొట్టి చంపాడు. అనంతరం ఆమె కాళ్లకు ఉన్న కడెలు తీసి దాచిపెట్టాడు. ఉదయం స్థానికులు పశ్నించగా, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం పోలీసులు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జంగయ్య గతంలో తన మామను చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసులు తెలిపారు.