వడ్లు కొనకుంటే ఆత్మహత్య చేసుకుంటా

వడ్లు కొనకుంటే ఆత్మహత్య చేసుకుంటా
  • కల్లాలు, సెంటర్లలోనే మొలకెత్తిన వడ్లు
  • ఈ పాపం ఎవరిది?
  • గోస పడుతున్న రైతులు
  • తేమ సాకుతో దింపుకోని మిల్లర్లు
  • మెజారిటీ సెంటర్లలో కాంటాలు బంద్​
  • కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు

(వెలుగు, నెట్​వర్క్​): వానలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నయ్. మడికట్లల్ల, కల్లాల్లో, రోడ్ల పొంట, కొనుగోలు సెంటర్లలో ఏ కుప్ప మీది పట్టా తీసి చూసినా మొలకలే కనిపిస్తన్నయ్. అనేక సెంటర్లలో తడిసిన వడ్లు రంగు మారి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నయ్​. తుఫాన్​ ఎఫెక్ట్​ రాష్ట్రంపై ఉంటదని, అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్తాయని వాతావరణశాఖ ముందే హెచ్చరించినా రాష్ట్ర సర్కారు ఏమాత్రం అలర్ట్​ కాలేదు. ఎక్కడా కొనుగోళ్లను స్పీడప్​ చేయలేదు. కనీసం రైతులకు పూర్తిస్థాయిలో టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. వడ్లలో తేమ ఎక్కువగా వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము దింపుకోబోమని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో రెండు రోజులుగా మెజారిటీ సెంటర్లలో ప్రభుత్వం కొనుగోళ్లు బంద్​పెట్టింది. తడిసిన కుప్పల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నరు. కొన్నిచోట్ల ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నరు. పోలీసులతో ఎక్కడిక్కడ రైతుల ఆందోళనలను అడ్డుకోవడం తప్ప ఎక్కడా ఆఫీసర్లుగానీ, ప్రజాప్రతినిధులుగానీ కొనుగోళ్లు స్పీడ్​గా జరిగేలా చర్యలు తీసుకోవడం లేదు. 

కొన్నది 14 శాతమే
ఈ వానాకాలం సీజన్​లో 6,821 కొనుగోలు సెంటర్ల ద్వారా కోటి 4 లక్షల టన్నుల వడ్లు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ కొనుగోళ్లు స్టార్ట్​ చేసి నెల దాటుతున్నా  ఇప్పటివరకు 14 శాతమే కొన్నారు. 5 వేలకు పైగా సెంటర్లలో కొనుగోళ్లు స్టార్ట్​ చేశామని సివిల్​ సప్లై ఆఫీసర్లు చెప్తున్నా అందులో సగం సెంటర్లలో కూడా కాంటాలు పెట్టట్లేదు. ఆసిఫాబాద్​, మంచిర్యాల, ములుగు, నాగర్‌‌ కర్నూల్‌‌, గద్వాల జిల్లాల్లోనైతే ఇప్పటికీ  ఒక్క సెంటర్​ కూడా ఓపెన్​ చేయలేదు. ఇక ఆదివారం వరకు భూపాలపల్లి జిల్లాలో 185 సెంటర్లకుగాను 22, మహబూబాబాద్​ జిల్లాలో 188 సెంటర్లకుగాను 27, వికారాబాద్​లో 146 సెంటర్లకుగాను  11 మాత్రమే ఓపెన్​చేశారు. వాటిలోనూ సగానికిపైగా కేంద్రాల్లో కాంటాలు పెట్టట్లేదు. కొనుగోళ్లు కూడా స్పీడ్​ అందుకోకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం14.84 లక్షల టన్నుల వడ్లే  కొనుగోలు చేశారు.

తేమ వస్తున్నదని కాంటాలు బంద్ 
వానల వల్ల చాలా కొనుగోలు సెంటర్లలో, కల్లాల్లో వడ్లు తడిశాయి. చాలా మంది రైతులు ప్రభుత్వం నుంచి టార్పాలిన్లు కూడా అందకపోవడంతో కిరాయికి తెచ్చుకుని కుప్పల మీద కప్పుకున్నారు. అయినప్పటికీ కుప్పల కిందికి వాన నీళ్లు పారడంతో వడ్లు తడిసిపోయాయి. వారం రోజుల నుంచి మబ్బులు, వర్షాల కారణంగా చాలా మంది రైతులు కుప్పలపై పట్టాలు తొలగించే సాహసం చేయలేదు. సోమవారం కాస్త వాన గెరువు ఇచ్చి, ఎండ పొడ రావడంతో వడ్లు ఆరబోసేందుకు పట్టాలు తొలగించగా.. మొలకెత్తిన వడ్లు కనిపించాయి. వడ్లలో తేమ 17 శాతం మించి వస్తుండడంతో ఇదే అదనుగా మిల్లర్లు వడ్ల లోడ్లను దింపుకోవట్లేదు. తడిసిన వడ్లు మరాడిస్తే నూక వచ్చి నష్టపోతామని, మరో వారం పది రోజుల దాకా వడ్లను పంపవద్దని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో సెంటర్లలో కాంటాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 200 సెంటర్లు ఓపెన్​కాగా,  వడ్లలో తేమ ఎక్కువగా వస్తోందంటూ రెండ్రోజుల నుంచి కొనుగోళ్లు బంద్​పెట్టారు. కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, ఎలిగేడు లాంటి మండలాల్లోని ఐకేపీ సెంటర్లు 90 శాతం బంద్ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 289 సెంటర్లు ఓపెన్​ కాగా.. సోమవారం ఏ సెంటర్​లోనూ కాంటా పెట్టలేదు.  సిద్దిపేటలోనూ తేమ ఎక్కువగా ఉందని సోమవారం 27 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ఆపేశారు. తేమ శాతం ఎక్కువగా వస్తోందని జనగామ జిల్లాలో టోకెన్లు బంద్​పెట్టారు. ఆది, సోమవారాల్లో 22 జిల్లాల్లో ఆఫీసర్లు కాంటాలు నిలిపివేశారు. ఆదివారం కేవలం 10 జిల్లాల్లో నామమాత్రంగా 44 వేల టన్నులు కొనుగోలు చేశారు. రైస్​మిల్లర్ల కోసమే కాంటాలు బంద్​పెట్టారని ఆయా చోట్ల రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. కరీంనగర్​, మెదక్​, జనగామ, యాదాద్రి, సూర్యాపేట తదితర జిల్లాల్లో సోమవారం ఆందోళనకు దిగారు. తేమతో సంబంధం లేకుండా వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. పోలీసులు వచ్చి రైతులతో  ధర్నా విరమింపజేశారు తప్ప ఏ ఒక్క పెద్దాఫీసర్​గానీ,  ప్రజాప్రతినిధిగానీ వచ్చి కొనుగోళ్లపై రైతులకు భరోసా కల్పించలేదు. 

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లికి చెందిన ముడావత్ లలిత రెండున్నర ఎకరాల్లో వరి వేసింది. 40 సంచుల వడ్లు వచ్చినయ్​. 20 రోజుల కింద కోసి, వడ్లను ఊర్లె రోడ్డు పక్కన ఆరబెడుతున్నది. ఇప్పటి వరకూ కొనుగోలు సెంటర్​ను ప్రభుత్వం ఓపెన్​ చేయలేదు. వానకు వడ్లు తడిసి, మొలకెత్తినయ్​. చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడులు మొత్తం గంగలో పోసినట్లయిందని లలిత కన్నీళ్లు పెట్టుకుంటున్నది.

సూర్యాపేట జిల్లాలో 333 సెంటర్లకు గాను 119 సెంటర్లలో తేమ పేరుతో కొనుగోళ్లు బంద్​పెట్టిన్రు.  ఇప్పటివరకు1,646 మంది రైతుల వద్ద వడ్లు కొన్నరు. వీరిలో 1,200 మంది రైతుల వద్ద కొన్న వడ్లలో తేమ17శాతం కంటే ఎక్కువగా ఉందనే  కారణంతో మిల్లర్లు వడ్లను అన్​లోడ్​ చేసుకోవట్లేదు. దీంతో ఆయా ట్రాక్టర్లు హుజూర్​నగర్​లోని మిల్లుల ముందు బారులు తీరినయ్​. 

నిర్మల్​ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని గొల్లమడ కొనుగోలు కేంద్రంలో పరిస్థితి ఇది. సోమవారం కురిసిన వర్షానికి ఈ ఒక్క సెంటర్​లోనే  దాదాపు 50 లారీల ధాన్యం తడిసింది.  పైనుంచి వర్షం.. కింది నుంచి వరద కారణంగా వడ్లు కొట్టుకుపోగా వాటిని ఎత్తుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డరు.  తడిసిన వడ్లు ఆరబెట్టాలంటే దాదాపు 20 రోజులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఈ కొనుగోలు సెంటర్ ప్రారంభమైనా ఆఫీసర్లు కాంటాలను మాత్రం బంద్​పెట్టిన్రు. లారీలు రావడం లేదని కారణం చెప్తున్నప్పటికీ తడిసిన వడ్లను తీసుకునేందుకు మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది.

కొనకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా: ఆఫీసర్​కు ఓ రైతు ఫోన్
వడ్ల కొనుగోళ్లు లేట్​ అవుతుండడంతో తీవ్ర ఆవేదనకు గురైన యాదాద్రి జిల్లా మోత్కూర్​కు చెందిన ఓ రైతు జిల్లా అధికారికి సోమవారం ఫోన్​ చేసిండు.  ‘‘సెంటర్​కు వడ్లు తెచ్చి నెలైంది. ఇప్పటివరకూ కొంటలేరు. ఇవ్వాళ కొనకుంటే ఆత్మహత్య చేసుకుంటా’’ అని కన్నీళ్లు పెట్టుకున్నడు. దీంతో  సదరు ఆఫీసర్​..  కొంటామని, వెయిట్​ చేయాలని, ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని కోరిండు.

తడిసిన వడ్లను ఇంటికి తీసుకెళ్లింది

యాదాద్రి జిల్లా ఆత్మకూర్​ (ఎం) మండలం ఖప్రాయిపల్లికి చెందిన రైతు రొండ్ల ధనమ్మ ఏడెకరాల్లో వరి సాగుచేసింది.  పంటను కోసి.. 
నెల కింద మోత్కూర్​ మార్కెట్​కు వడ్లు తెచ్చింది. చాలా రోజుల పాటు కొనుగోలు చేయకపోవడంతో ఈలోగా వానలు పడి 50 సంచుల వడ్లు తడిసి మొలకెత్తినయ్​. సోమవారం 370 సంచులను తూకం వేస్తే.. మొలకొచ్చిన 50 సంచుల వడ్లను ఆఫీసర్లు తీసుకోలేదు. దీంతో ధనమ్మ ఆ వడ్లను ఇంటికి తీసుకెళ్లింది.  

టైంకు కొంటే వడ్లు తడిసేయి కాదు 
నేను ఐదెకరాల్లో వరి పెట్టిన. నెల కింద కోసి నగునూర్ సెంటర్​లో వడ్ల కుప్పలు పోసిన. 15 రోజుల కింద 17 శాతం కన్నా తక్కువ మాయిశ్చర్​ వచ్చింది. కానీ కాంటాలు పెట్టే టైంలో వివరాలు ఆన్​లైన్​ చేసేందుకు ఓటీపీ కావాలన్నరు.  ఓటీపీ వస్తేనే వడ్లను కొంటామన్నరు. భూమి వివరాల నమోదులో సమస్య వల్ల ఓటీపీ వస్తలేదు. ఇటీవల కురిసిన వానలకు వరద నీరంతా కుప్పల కిందికి చేరడంతో నాలుగైదు క్వింటాళ్లకు పైగా వడ్లు మొలకెత్తినయ్​.
 - దామరపల్లి గంగారెడ్డి, నగునూర్, కరీంనగర్ మండలం

మమ్ముల పట్టించుకునేటోళ్లు లేరు.. 
నాకున్న మూడెకరాల్లో వరి వేసిన. పంట కోసి 20  రోజులైంది. ఆ రోజు నుంచి వడ్లను ఆరబెడుతూనే ఉన్నా. కనీసం టార్పాలిన్లు కూడా ఇయ్యలే. ఒక్కో కవర్​ను రూ. 30 చొప్పున తెచ్చి 20 రోజులుగా కిరాయి కడ్తున్న. ఇన్ని రోజులైనా సెంటర్లు ఓపెన్​ చేస్తలేరు. మా వడ్లను ఎవరూ కొంటలేరు.  
- బీరయ్య, రైతు, మిడ్జిల్,   మహబూబ్​నగర్​ జిల్లా