లోను కట్టలేదని భూమి వేలం వేస్తామంటున్నరు

లోను కట్టలేదని భూమి వేలం వేస్తామంటున్నరు
  • భూమి వేలం వేస్తామంటూ ఊర్లో ప్రచారం చేస్తున్నారని రైతు ఆవేదన

సైదాపూర్, వెలుగు: బర్ల లోను కట్టకపోడంతో తన భూమి వేలం వేస్తామని ఊర్లో ప్రచారం చేసి పరువు తీస్తున్నారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్​ జిల్లా సైదాపూర్​ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన బుర్ర తిరుపతి నాలుగేండ్ల క్రితం వెంకేపల్లి -విశాల సహకార పరపతి సంఘంలో రూ. 3 లక్షల బర్ల లోనుకు దరఖాస్తు చేసుకున్నారు. మొదట రూ. 1.5 లక్షలు, ఆరు నెలల తర్వాత మిగతా డబ్బులు ఇచ్చారని రైతు తెలిపారు. ఇందులో రూ. 30 వేలు వాటాగా పట్టుకున్నారన్నారు. ఇప్పటికే రూ. 40 వేల వరకు కిస్తీ చెల్లించానని.. అయినప్పటికీ గత ఏడాది పంట డబ్బులు రూ. 80 వేలు ఇవ్వకుండా అకౌంట్ ను హోల్డ్​లో పెట్టారన్నారు. గ్రామంలో పరువు పోయేలా అవమానపరుస్తున్నారని, తన 3 ఎకరాల 18 గుంటల భూమిని ఈ నెల 21న వేలం వేస్తామని ఇంటింటికి పాంప్లేట్స్​ పంచారని, మైకుతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. క్షక్ష కట్టి తనను వేధిస్తున్నారని,  ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.