సిద్దిపేట, వెలుగు: భూ సమస్య పరిష్కారం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ప్రజావాణి కార్యక్రమంలో భైఠాయించి నిరసన తెలిపాడు. ఈ ఘటన సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగింది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన చిలుపూరి ఎల్లారెడ్డి అనే రైతుకు గ్రామంలో వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల వ్యవసాయ భూమిపై వివాదం నెలకొంది.
రెవెన్యూ అధికారులు ఆ భూమితో పాటు తాను కొనుగోలు చేసిన మరో 17 ఎకరాలను కలిపి బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు ఎల్లారెడ్డి తెలిపారు. దీంతో రైతుబంధు సాయం అందడం లేదని, ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయాడు. ఈ విషయంపై అక్కన్నపేట తహసీల్దార్‌కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదని, ప్రజావాణిలో కూడా పలుమార్లు అర్జీ సమర్పించినట్లు తెలిపాడు. పోలీసులు ఆయనను సముదాయించి బయటకు పంపించారు.
