రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం :  మంత్రి జూపల్లి కృష్ణారావు

కోడేరు,(పెద్దకొత్తపల్లి),వెలుగు:  రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. కేఎల్ఐ డి8 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. 

రాజాపూర్ గ్రామంలో రైతులకు విద్యుత్ స్తంభాలు, సబ్సిడీ స్ప్రింక్లర్లు  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో రావడం లేదనే సమస్యను నాయకులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి సబ్సిడీ స్ప్రింక్లర్లు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు.   కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు దండు సాంబశివుడు, ఉప సర్పంచ్ ఎండీ సిరాజ్, నాయకులు పల్లె కురుమూర్తి, బాలయ్య, కురుమయ్య, వెంకటయ్య, బాలచంద్రి తదితరులు ఉన్నారు.