
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ అగ్రనేతలు స్పందించారు. కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ‘కిసాన్ న్యాయ్’ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చరిత్రాత్మక అడుగు వేసిందని అన్నారు. 40 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణరహితంగా మార్చేందుకు రూ.2 లక్షల వరకు మాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీపై శనివారం ‘ఎక్స్’వేదికగా రాహుల్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు కుటుంబాలకు అభినందనలు తెలిపారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులు, కార్మికులతోసహా అణగారిన వర్గాల బలోపేతానికి రాష్ట్ర ఖజానాను ఖర్చు చేస్తామన్న గ్యారెంటీ.. అందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమే ఉదాహరణ. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా.. రాష్ట్ర ఖజానాను పెట్టుబడిదారుల కోసం కాకుండా ప్రజలకోసం ఖర్చు చేస్తుంది. ఇదే మా వాగ్దానం’’ అని పునరుద్ఘాటించారు.
చరిత్రాత్మకమైన నిర్ణయం: ఖర్గే
అన్నదాతలకు రూ. 2 లక్షల రుణమాఫీ చరిత్రాత్మకమైన నిర్ణయం అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణలోని 40 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి కలగనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఖర్గే స్పందించారు. ‘జై కిసాన్.. జై హిందుస్తాన్’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు సరిగ్గా పదహారేండ్ల క్రితం 3.73 కోట్ల మంది రైతులకు మేలు చేస్తూ తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగా రూ.72 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, వడ్డీలను మాఫీ చేసిందని చెప్పారు. ‘‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ చాలాసార్లు రైతుల రుణాలను మాఫీ చేశాం. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 4 వివాదాస్పద నల్ల (వ్యవసాయ) చట్టాలను రూపొందించింది. నిరసన తెలిపిన రైతులను అడ్డుకోవడంతోపాటు వారిపై డ్రోన్లతో భాష్పవాయువు ప్రయోగించింది. రబ్బరు బుల్లెట్లు, లాఠీలతో హింసించింది’’ అని తెలిపారు. రైతులకు ‘కిసాన్ న్యాయ్’ కింద పంటలకు సరైన ధర, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, బీమా చెల్లింపులను ప్రత్యక్షంగా బదిలీ చేయడం, సరైన వ్యవసాయ దిగుమతి-, ఎగుమతి విధాన రూపకల్పనకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆ పార్టీ వెల్లడించింది. ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తామని ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నట్టు అధికారిక ఖాతా ద్వారా ఎక్స్ లో పోస్ట్ చేసింది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500కు వంటగ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని గతంలో వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్చేసిన ట్వీట్‌ను ఈ పోస్ట్ కు జోడించింది.