రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలైతలే 

రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలైతలే 
  • నిర్వహణ సర్కారే చూసుకుంటదన్న కేసీఆర్ హామీ అమలైతలే 
  • 30 ఏండ్లుగా ఖర్చులు భరిస్తున్న నాగార్జున సాగర్ ఎడమ కాల్వ రైతులు  
  • మోటార్లు, కాల్వల రిపేర్లు, ఆపరేటర్లకు జీతాల కోసం చందాలు
  • పైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారమంతా రైతులే భరిస్తున్నారు. 30 ఏండ్లుగా లిఫ్టుల మెయింటనెన్స్ ఖర్చులన్నీ పెట్టుకుంటున్నారు. మోటార్లు చెడిపోయినా, కాల్వలు దెబ్బతిన్నా చందాలు వేసుకొని చేయించుకుంటున్నారు. చివరకు ఆపరేటర్ల జీతాలు కూడా వారే చెల్లిస్తున్నారు. తెలంగాణ ఏర్పడినంక లిఫ్టుల నిర్వహణ సర్కారే చూసుకుంటుందని ఉద్యమం టైమ్ లో కేసీఆర్ హామీ ఇచ్చారు. హుజూర్​నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ చెప్పారు. కానీ ఇప్పటికీ హామీ అమల్లోకి రాలేదు. లిఫ్టుల నిర్వహణ కోసం ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. ఇంతకుముందు వివిధ డిపార్ట్ మెంట్ల పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నింటినీ ఇరిగేషన్ శాఖ పరిధిలోకి తెచ్చినప్పటికీ, లిఫ్టుల నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు. ఏటా పంటల సీజన్ ప్రారంభానికి ముందు రిపేర్ల కోసం నిధులు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.   

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ పరిధిలో మేజర్, మైనర్ కలిపి 46 లిఫ్టులు నిర్మించారు. వీటి కింద లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. కానీ ప్రస్తుతం సగం ఆయకట్టు కూడా లిఫ్టుల కింద పారడం లేదని సొసైటీల చైర్మ న్లు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా దాదాపు240 కోట్లతో రిపేర్లు చేపట్టారు. కానీ సివిల్ వర్క్ ఎక్కడికక్కడే పెండింగ్ లో ఉంది. దీంతో పూర్తి ఆయకట్టు సాగులోకి రాకుండా పోతోంది. రైతులు మళ్లీ బోరు బావులపైనే ఆధారపడి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. లిఫ్టుల పరిధిలో దాదాపు 70 శాతం మంది రైతులు బోర్లు, ఇతర సౌలతులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలకు డిజైన్​చేసిన లిఫ్టుల కింద వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుండడంతోనే చివరి భూముల వరకు నీళ్లు అందడం లేదని అధికారులు అంటున్నారు. 24 గంటల ఉచిత కరెంట్ వల్ల రైతులు ఎక్కువగా వరి సాగుపైనే ఆసక్తి చూపడంతో లిఫ్టుల ప్రయోజనం నెరవేరడం లేదని చెబుతున్నారు. అధికారులు ఇలా మాట్లాడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. 

రూ.200 నుంచి 2 వేల చందా  

లిఫ్టుల రిపేర్లు, ఆపరేటర్ల జీతాల కోసం రైతులు చందాలు వేసుకుంటున్నారు. లిఫ్టు ఆయకట్టు పరిధిని బట్టి ఒక్కో రైతు రూ.200 నుంచి 
రూ.2 వేల వరకు చెల్లిస్తున్నారు. పంటల సీజన్ కు ముందు అందరూ సమావేశమై ఎంత చందా వేసుకోవాలనేది నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం తిమ్మాపురం లిఫ్టు కింద రెండు పంటలకు కలిపి రూ.500 ఇవ్వాలని నిర్ణయించారు. చందాల డబ్బులతో లిఫ్టుల పైపులైన్లు, కాల్వలు దెబ్బతిన్నా, ట్రాన్స్ ఫార్మర్లు, స్టార్టర్ల రిపేర్లు, కాల్వల్లో పూడికతీత తదితర పనులన్నీ చేయిస్తున్నారు. అలాగే ఆపరేటర్లకు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు చెల్లిస్తున్నారు.

పంటకు 1,200 ఇస్తున్నం 

మా పరిధిలో ఆర్ 5 లిఫ్ట్ ఉంది. రెండెకరాలకు గాను సీజన్​కు రూ.1,200 చెల్లిస్తున్న. ప్రతి సీజన్​లో రిపేర్లు రావడంతో వాటి కోసం చందాలు వసూలు చేయాల్సి వస్తోంది. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా లిఫ్టుల భారాన్ని 
ప్రభుత్వమే భరించాలి.
- డి. సైదానాయక్, వాటర్ ట్యాంక్ తండా