వరి నాట్లు లేట్​..కూలీల కొరతతో మరింత ఆలస్యం

వరి నాట్లు లేట్​..కూలీల కొరతతో మరింత ఆలస్యం
  •     వానాకాలం సీజన్ లో పావు వంతు పడని నాట్లు
  •     కూలీల కొరతతో మరింత ఆలస్యం
  •     వెదజల్లే పద్దతిలో సాగు చేయాలంటున్న అధికారులు

వనపర్తి, వెలుగు : సకాలంలో వర్షాలు కురవక పోవటంతో ముందుగా పోసిన నార్లు ముదురుతున్నాయి. దీనికి తోడు నాట్లు వేయడానికి కూలీలు దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి వర్షాలకు వనపర్తి జిల్లాలో చెరువులు కూడా నిండకపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వరి నారు ముదరడంతో కొందరు అలాగే నాట్లు వేస్తుండగా కొత్తగా మరోసారి నారు పోసుకునే  సమయం లేక మరికొందరు  వడ్లు పొలాల్లో వెదజల్లుతున్నారు.

సకాలంలో నాట్లు పడక రైతులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల కింద పరిస్థితి ఇలా ఉంటే  బోర్లు, బావుల కింద ముసురు వర్షాలతో పనులు సాగక ఆలస్యం అయ్యింది. జూలై రెండో వారం లోపు నాట్లు వేయాల్సి ఉంది. నారు పోసుకున్న ముప్పై నుంచి నలభై రోజులలోపు నాట్లు వేసుకోలేదు. దీంతో నార్లు ముదిరిపోయాయనిరైతులుఆందోళన చెందుతున్నారు.ఆలస్యంగా నాటుకుంటే దిగుబడి తగ్గుతుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

కూలీల కొరత...           

వర్షాలు తెరపి ఇవ్వటంతో  రైతులంతా ఒకేసారి పనులు ప్రారంభించారు. దీంతో  కూలీల కొరత ఏర్పడింది. నాట్లు వేసే కూలీలు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. స్థానికంగా కూలీలు దొరకక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. కొన్నిచోట్ల మగవారే నాట్లు వేస్తున్నారు.  ఎకరాకు దాదాపు  రూ.6 నుంచి 7 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక రోజు నాటు వేస్తే వెయ్యి రూపాయల వరకు కూలి గిట్టుబాటు అవుతుంది.  ఇది రైతుకు భారం అవుతోంది. అలాగే ఇతర కూలీల రేట్లు పెరగటంతో వరి సాగు లో పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ కూలీలు ఆ తర్వాత క్షణం తీరిక లేకుండా ఉన్నారు.  

పావువంతు నాట్లు పడలే 

 వనపర్తి జిల్లాలో గత సంవత్సరం ఇదే సమయానికి ఒక లక్ష 58వేల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. ప్రస్తుతం 50 వేల ఎకరాలు కూడా  వేయలేదు. ఉమ్మడి జిల్లాలోని జూరాల, కల్వకుర్తి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ లింక్ కెనాల్  కింద వరి నాట్లు ఇంకా సగం కూడా పడలేదు.

ముదురు నార్లు వేయవద్దు

ఆలస్యంగా వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ముందుగా పోసుకున్న వరినారు మళ్లు చాలా చోట్ల ముదిరిపోయాయి. సోనా మసూరి సన్నరకం వరి విషయంలో 40 రోజుల వరకు నాట్లు వేసుకోవచ్చు.  దొడ్డు రకం వరి  పైరులో మాత్రం ముదురు నార్లు వేసుకుంటే దిగుబడి తగ్గిపోతుంది. రైతులు వడ్లు, మండె కట్టి మొలక వచ్చాక కరిగెట్లలో పలుచగా వెదజల్లుకోవాలి.ఈ విధానం వల్ల  కూలీల ఖర్చు తగ్గుతుంది. మొలక వచ్చిన నెల రోజుల తర్వాత కలుపు  మందు పిచికారి చేసుకోవాలి. 24 గంటల తర్వాత మడులలో నీరు నిలుపుకోవాలి.ఈ పద్దతి పాటిస్తే రైతులు ఈ సీజన్ లో  పంటలు పండించుకోవచ్చు.

- సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి.