రైతులు వాణిజ్య పంటలే ఎక్కువేస్తున్నరు

రైతులు వాణిజ్య పంటలే ఎక్కువేస్తున్నరు

తగ్గిన ఆహార పంటలు

రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైన 81 లక్షల ఎకరాల్లో 53 లక్షలు పత్తే

వరి సాగు గతేడాది 52 లక్షల ఎకరాలు.. ఈసారి 11 లక్షలే

సర్కారు నియంత్రిత సాగులో వాణిజ్య పంటలకే ప్రిఫరెన్స్

చిరు ధాన్యాలూ తగ్గుతున్నయ్‌.. నూనె పంటలూ అంతంతే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తినే పంటల సాగు తగ్గిపోతోంది. అమ్ముకునే వాణిజ్య పంటల సాగు ఎక్కువవుతోంది. సర్కారు కొత్తగా తీసుకొచ్చిన షరతుల సాగులోనూ వాణిజ్య పంటల‌కే ప్రాధాన్యమివ్వడంతో ఇది మరీ ఎక్కువవుతోంది. ముఖ్యం గా పత్తి పంట సాగు విపరీతమవుతోంది. చిరుధాన్యాల సాగైతే బాగా తగ్గిపోతోంది. ఆయిల్‌‌ సీడ్స్‌‌ పంటలను అక్కడోటి ఇక్కడోటి వెతుక్కోవాల్సినంతగా సాగు పడిపోయింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల‌ ద్వారా ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి.

వరి 23 లక్షల ఎకరాల్లోనే

మన దగ్గరున్న మొత్తం సాగు భూమిలో 56 శాతం కమర్షియల్‌‌ పంటలే వేస్తున్నారు. మిగిలిన 44 శాతం భూమిలో తినే పంటలన్నీ కలిపి పండిస్తున్నరు. రాష్ట్రంలో ఇప్పటివరకు 81.59 లక్షల ఎకరాల్లో పంటలేస్తే ఇందులో 52.94 లక్షల ఎకరాల్లో పత్తినే వేశారు. వరితో కలిపి మిగతా పంటలన్నీ 30 లక్షల్లో సాగు చేశారు. సాధారణంగా రాష్ట్రంలో ఆహార పంటలను 50.85 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఈసారి ఇప్పటివరకు 23.61 లక్షల్లోనే వేశారు.

ఆయిల్ సీడ్ సాగేది?

రాష్ట్రంలో ఆయిల్ సీడ్స్ సాగు ప్రమాదకర స్థాయిలో పడిపోతోంది. సోయాబీన్‌‌ తప్ప మిగతా పంటల సాగు బాగా తగ్గింది. సాధారణ సాగుతో పోలిస్తే వేరుశనగ 20 శాతం, నువ్వలు 13 శాతం, పొద్దుతిరుగుడు 1 శాతమే సాగు చేస్తుండటం ప్రమాదకర సంకేతాలిస్తోంది. వేరుశనగ 42,630 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 8,332 ఎకరాల్లోనే ఈసారి వేశారు. నువ్వులు 4,683 ఎకరాలకు గాను 595 ఎకరాల్లో.. పొద్దు తిరుగుడు చాలా తక్కువగా 7 ఎకరాల్లోనే వేయడం రాష్ట్రంలో ఆయిల్ సీడ్స్ పంటల పరిస్థితిని చెబుతోంది.

ఎగుమతి అవుతున్న వరి

రాష్ట్రంలో ఆహార పంటల్లో వరినే ఎక్కువ పండిస్తున్నారు. ఏటా సుమారు 40 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 57.60 లక్షల టన్నుల వరి ధాన్యం అవసరం అమవుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. మిగిలిన ధాన్యం ఎఫ్‌‌సీఐ ద్వారా కేరళ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్‌‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు ముఖ్యం గా దొడ్డు రకాలను ఎక్కువగా ఎక్స్‌‌పోర్ట్‌‌ చేస్తున్నారు. ఫలితంగా వాణిజ్య పంటల లిస్టులో వరి కూడా చేరిపోతోంది.

ఫైన్బియ్యమే తింటున్నరు

రాష్ట్రంలో ఏటా 45 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతోంది. ఇందులో 69.21 శాతం ఫైన్ వెరైటీ బియ్యమే జనం తిం టున్నారని అగ్రికల్చర్, సివిల్ సప్లయ్స్​శాఖల అధ్యయనంలో తేలింది. వీటిల్లోనూ సాంబ మసూరి (బీపీటీ 5204) 50 శాతం తింటున్నట్లు తెలిసింది. సాధారణ, దొడ్డు రకాలు కలిపి 20 లక్షల టన్నులు తింటున్నారని.. వీటిలో అత్యధికంగా ఎంటీయు(1010) వాడుతున్నారని వెల్లడైంది.

పప్పు ధాన్యాలూ తగ్గుతున్నయ్

పప్పు ధాన్యాల సాగూ తగ్గుతూ వస్తోంది. వీటి సాధారణ సాగు విస్తీర్ణం 10.5 లక్షల ఎకరాలైతే ఇప్పటి వరకు 9.5 లక్షల ఎకరాల్లో వేశారు. పెసర్ల సాధారణ సాగు 2 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 1.11 లక్షల ఎకరాల్లో.. మినుముల సాగు విస్తీర్ణం 68 వేల ఎకరాలైతే ఈసారి 40 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఉలవలు 777 ఎకరాల్లో వేయాల్సి ఉండగా ఈసారి ఎక్కడా సాగు చేయలేదు. కందుల సాగు విస్తీర్ణం 7.6 లక్షలైతే ఈసారి అది పెరిగి 7.9 లక్షలైంది.

పెరుగుతున్న వాణిజ్య పంటల సాగు

రాష్ట్రంలో పత్తి, మిరప, పసుపు తదితర కమర్షియల్ క్రాప్స్ సాగు పెరుగుతోంది. ప్రభుత్వం ఈసారి పత్తి పంట వేయమని చెప్పడంతో 44.50 లక్ష సాధారణ సాగు కాస్త ఇప్పటికే 52.94 లక్షల ఎకరాలు దాటేసింది. ఈ ఏడాది 60.16 లక్షల ఎకరాలు దాటొచ్చని అనుకుంటున్నారు. దీనికి తోడు ఏటా 2లక్షల ఎకరాల్లో పండే మిర్చి , పసుపు పంటలూ ఈ ఏడాది పెరిగొచ్చని అగ్రికల్చర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇలాగైతే భవిష్యత్తులో ఆహార పంటల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మండుతున్న మిల్లెట్స్ రేటు

కార్బొహైడ్రేడ్లు ఎక్కువగా ఉండే బియ్యం, గోధుమలు తింటూ జనం షుగర్ వ్యాధి బారిన పడుతుండటంతో ఆహార నిపుణులు, డాక్టర్లు వాటిని తగ్గించాలని సూచిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, సామెలు, ఊదలు… వంటి సిరి ధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు పండించడం ఇప్పుడు బాగా తగ్గింది. దీంతో డిమాండ్‌‌ పెరిగి ధరలు భగ్గు మంటున్నాయి.

వరి సాగు మస్తు తగ్గింది

రాష్ట్రంలో సాధారణంగా వరిని 27 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. అయితే గతేడాది అత్యధికంగా 52 లక్షల ఎకరాల్లో వేయగా ఈసారి ఇప్పటివరకు 11.38 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. మొక్క జొన్న సాధారణ సాగు 11.76 లక్షలు కాగా గతేడాది 7 లక్షల ఎకరాల్లో వేశారు. ఈసారి ఇప్పటివరకు లక్షన్నర ఎకరాల్లో నే సాగు చేశారు. జొన్నల సాధారణ సాగు 1.19 లక్షల ఎకరాలైతే ఈసారి లక్ష ఎకరాల్లో వేశారు.